కలకలం: గుంటూరులో మాయమై మాచర్లలో తేలిన కరోనా రోగి

By telugu teamFirst Published Apr 22, 2020, 5:54 PM IST
Highlights

గుంటూరు జిల్లా మాచర్లలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గుంటూరు ఆస్పత్రి నుంచి పరారైన కరోనా వైరస్ రోగి మాచర్ల చేరుకున్నాడు. అక్కడి నుంచి సొంత గ్రామానికి చేరుకున్నాడు.

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. మాచర్ల కరోనా వైరస్ నుంచి బయటపడుతున్న తరుణంలో ఈ కరోనా పాజిటివ్ వ్యక్తి గుంటూరు నుంచి పారిపోయి రావడంతో తిరిగి భయాందోళనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు ఆస్పత్రి నుంచి పారిపోయి అతను మాచర్ల వచ్చాడు. 

మాచర్లలోని ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఓ ఇంట్లో టిఫిన్ చేసినట్లు తెలుస్తోంది. మాచర్ల నుంచి అతను పసువేముల గ్రామానికి చేరుకున్నాడు. దాంతో గ్రామంలో కూడా కలకలం ప్రారంభమైంది. గుంటూరు నుంచి పరారైన వ్యక్తి ఫోన్ కు అధికారులు కాల్ చేశారు. తాను గ్రామంలో ఉన్నట్లు అతను తెలిపాడు. ఎలా వెళ్లావని అడిగితే ఓ లారీలో ప్రయాణం చేసి వచ్చినట్లు తెలిపాడు. 

దాంతో అధికారులు అప్రమత్తమై లారీని గుర్తించడంతో ఆ వ్యక్తితో కాంటాక్డులోకి వచ్చినవారిని గుర్తించారు. అతనితో కాంటాక్టులోకి వచ్చిన 49 మందిని క్వారంటైన్ కు తరలించారు. గుంటూరు జిల్లాలో తాజాగా 16 కేసులు నమోదు కాగా, మాచర్లలో ఐదు నమోదయ్యాయి. అవన్ని కూడా ఢిల్లీ మర్కజ్ తో లింకులున్న కేసులే కావడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో కరోనా పాజిటివ్ వ్యక్తి గుంటూరు ఆస్పత్రి నుంచి పారిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

click me!