ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు చితకబాదడంతో ఓ యువకుడు మరణించాడు. దీంతో మృతదేహంతో మృతుడి బంధువులు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో మెడికల్ షాపునకు వచ్చిన యువకుడిని పోలీసులు తీవరంగా కొట్టారు. దాంతో అతను కుప్పకూలిపోయాడు.
సత్తెనపల్లి చెక్ పోస్టు వద్ద ఆ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల దెబ్బలకు కుప్పకూలిన యువకుడు మహ్మద్ గౌస్ ను ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో ఆగ్రహించిన యువకుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో పోలీసు స్టేషన్ ముందు వారు ధర్నాకు దిగారు.
మందుల కోసం ఆ యువకుడు మందుల షాపునకు వచ్చాడు. లాక్ డౌన్ అమలవుతోందని, ఎందుకు బయటకు వచ్చావంటూ పోలీసులు అతన్ని చితకబాదారు. ఆందోళనకారులు పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానం గుంటూరు జిల్లా ఆక్రమించింది. దీంతో గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.