తల్లిదండ్రులు మందలించారన్న మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు: అతిగా ఫోన్ మాట్లాడుతున్నందుకు తల్లిదండ్రులు మందలించడంతో ఓ మైనర్ బాలిక దారుణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన కారంకీ స్నేహ స్మిత (14) 9వతరగతి చదువుతోంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వుంటున్న బాలిక నిత్యం ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుండేది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు బాలికను సున్నితంగా మందలించారు.
అయితే బాలిక మాత్రం ఈ మందలింపును అవమానంగా భావించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కారంకీ జాన్సిరాణి ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.