''కాకినాడ వాసులకు కరోనా లక్షణాలు... భయంతో వైద్యులు విధులకు గైర్హాజరు''

By Arun Kumar PFirst Published Feb 5, 2020, 3:55 PM IST
Highlights

కరోనా వైరస్ భారిన పడకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.

గుంటూరు: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వణికిస్తోందని... దీని బారిన పడి చైనాలో అనధికారికంగా 10వేలమంది వరకు చనిపోయారని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు. ఇంతటి భయంకర వైరస్ బారిన తమ ప్రజలు పడకుండా భారత్ లోని వివిధ రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవడమే కాదు అవగాహ కూడా కల్పిస్తున్నారని తెలిపారు. కానీ ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని కొమ్మారెడ్డి ఆరోపించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కరోనావైరస్‌కు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖతో, ఇతర అనుబంధ శాఖలతో ఒక్కటంటే ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం విచారకరమన్నారు. కరోనావ్యాప్తిపై జిల్లా కలెక్టర్లతో, వైద్యశాఖ, ఇతరశాఖల సిబ్బందితో సమీక్షలు నిర్వహించకుండా రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులను విచారించకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్‌ పాకులాడుతున్నాడని పట్టాభిరామ్ మండిపడ్డారు. 

read more   కరోనా వైరస్... విస్కీనే అసలైన మందంటున్న టీచర్, వీడియో వైరల్

చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగులను తక్షణమే స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు  జనవరి 31న కేంద్ర విదేశాంగమంత్రికి లేఖరాశారని తెలిపారు. అలాంటిది బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి కనీసం లేఖకూడా రాయకపోవడం బాధాకరమన్నారు. 

స్వదేశంలో, స్వరాష్ట్రంలో ఉన్న వారిని జగన్‌ ఎలాగూ పట్టించుకోవడంలేదు కనీసం విదేశాల్లో ఉన్నవారి గురించికూడా పట్టించుకోకపోతే ఎలాగని పట్టాభి నిలదీశారు. నిఫా వైరస్‌ 2018లో దేశంలోకి ప్రవేశించినప్పుడు జిల్లాలవారీగా చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించి అన్నిరకాలుగా ముందుజాగ్రత్తలు తీసుకొన్నారని...దీంతో రాష్ట్రం నిఫాబారిన పడకుండా వుందన్నారు. 

కాకినాడలో కరోనా లక్షణాలతో కొందరు ప్రభుత్వాసుపత్రి చేరారని... దీంతో అక్కడ పనిచేసే వైద్యులు భయంతో విధులకు వెళ్లడం మానేశారని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జగన్‌ ముఖ్యమంత్రయ్యాక డెంగ్యూ బారినపడి అనేకమంది మరణించినా దోమల నిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదన్నారు. 

read more  కరోనావైరస్ : ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిపై అనుమానం..చైనా నుండి వచ్చాడు..అందుకే...

రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో కరోనాను గుర్తించే స్కానర్లు, పరికరాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని... ఆ వైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే  జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. డెంగ్యూ విషయంలో మాదిరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతుందని... దానివల్ల ప్రాణనష్టం తప్పదని పట్టాభి హెచ్చరించారు. 

జగన్‌ ఇప్పటికైనా తన మొద్దునిద్రను వీడి చంద్రబాబు మాదిరిగా అత్యవసరంగా సమీక్షలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని... అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టాభిరామ్ సూచించారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించే పరికరాలు, స్కానర్లు ఏర్పాటుచేసి వ్యాధి లక్షణాలున్న వారికి అత్యవసర వైద్యసేవలు అందించాలని టీడీపీనేత సూచించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న జగన్‌ సర్కారు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టాలని పట్టాభిరామ్ డిమాండ్‌చేశారు.      
 
  

click me!