ఇక రంగంలోకి ఏసిబి...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు....: జగన్ హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Nov 12, 2019, 7:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుతీరుపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రివ్యూ నిర్వహించారు.ఈ  సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 


అమరావతి: స్పందనలో వచ్చే ఫిర్యాదులు, వినతుల పరిష్కారంలో నాణ్యత కోసం స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌పై 6 జిల్లాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ సీఎం స్పందన కార్యక్రమంపై  జగన్‌ జరిపిన సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  పేర్ని నాని,  నారాయణస్వామి సహా పలువురు అధికారులు హాజరయ్యారు. 

కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎస్సైలు, మున్సిపల్‌ కమిషనర్లు... తదితర అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉండేలా చూడాలని ఆదేశించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత అన్నది చాలా ముఖ్యమని, దాని కోసమే ఈ ప్రయత్నాలన్నీ అని అన్నారు.అధికారమన్నది చలాయించడానికి కాదని.. ఒకరు ఒక విజ్ఞాపన పత్రంతో వచ్చినప్పుడు వారితో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్నది చాలా ముఖ్యమన్నారు.  

Latest Videos

అర్జీతో వస్తున్న వ్యక్తిని మనం ఎలా ట్రీట్‌ చేస్తున్నామన్నదే ముఖ్యమని... మనం ఏదైనా ఒక అర్జీతో ఏ అధికారి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు ఎలా స్పందించాలని అనుకుంటామో, అలాగే మన దగ్గరకు ఎవరైనా అర్జీతో వచ్చినప్పుడు అదే విధంగా స్పందించాలని అధికారులకు సూచించారు. అధికారమన్నది చలాయించడానికి కాదు, సేవ చేయడానికేనన్న విషయాన్ని మరిచిపోవద్దని..అత్యున్నత స్థాయి నుంచి కింది స్థాయి అధికారి వరకూ ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు. 

ప్రజల మీద అధికారం చలాయించడానికి కాదు మనం ఉన్నది, మనం ప్రజా సేవకులమన్న విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. అవినీతిపై పోరు ఉధృతం చేశామని... అవినీతి అన్న అంశం మీద పోరాటాన్ని అగ్రెసివ్‌గా తీసుకోవాలని...ఎక్కడా అవినీతికి చోటు లేదన్న విషయం కింది స్థాయి అధికారుల వరకూ చేరాలన్నారు. వచ్చే రెండు మూడు వారాల్లో ఏసీబీని పెద్ద ఎత్తున రంగంలోకి దించుతున్నామన్నారు. చాలా చురుగ్గా ఏసీబీ పని చేస్తుందన్నారు,

read more  చంద్రబాబు దత్తపుత్రుడు: పవన్ కల్యాణ్ కు పెద్దిరెడ్డి కౌంటర్

 
ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ (ఆప్‌కాస్‌) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌  ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభిస్తున్నామని...జిల్లాలోని ప్రతి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, రాష్ట్రస్థాయిలోనూ, సెక్రటేరియట్‌లో కూడా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఈ కార్పొరేషన్‌ పరిధిలోకి  తీసుకువస్తున్నామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు.

 ఈ కార్పొరేషన్‌ ఎందుకు పెడుతున్నామో కారణాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని...మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలన్నదే ఉద్దేశం, జీతం ఇచ్చేటప్పుడు.. ఉద్యోగులను మోసం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మాత్రం ఇస్తేనే.. నీకు జీతం ఇస్తానన్న మోసపూరిత పనులకు చెక్‌ పెడుతున్నామని...
సకాలానికే జీతాలు వచ్చేలా చూడడంతో పాటు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకే ఈ కార్పొరేషన్‌ ఉపయోగపడుతుందన్నారు.

లంచాలు తీసుకుని అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని..మోసాలకు తావు లేకుండా, లంచాలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. నెలవారీ జీతం రూ.30 వేల లోపు ఉన్న ఉద్యోగాలను అవుట్‌ సోర్స్‌ కార్పొరేషన్‌ కింద భర్తీ చేస్తామని...వివిధ శాఖలు, విభాగాలు.. తమకు కావాల్సిన ఉద్యోగాల జాబితాను కార్పొరేషన్‌కు సమర్పిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్‌ నుంచి జిల్లాల స్థాయి వరకూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీ కార్పొరేషన్‌ ద్వారానే జరుగుతుందని వెల్లడించారు.

జిల్లా స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారని..జిల్లా కమిటీకి జిల్లా కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారన్నారు. సెక్రటేరియట్‌కు వచ్చేసరికి సంబంధిత శాఖ మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారని... సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా ఉంటారని తెలిపారు. డిసెంబరు 15లోగా ప్రక్రియను పూర్తిచేసి, జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్స్‌ ఇవ్వాలని  ఆదేశించారు. 

ప్రతి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగానికి ఒక కోడ్‌ నంబర్‌ ఇచ్చి, ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటిటీగా తీసుకుని, అందులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఇస్తారన్నారు.
మొత్తంగా చూస్తే యాభై శాతం ఉద్యోగాలు మహిళలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  

 అవుట్‌ సోర్స్‌ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాతనే అధికారులు జీతాలు తీసుకునే స్థాయిలోకి రావాలన్నారు.డిసెంబరు 15 కల్లా ఉద్యోగాల జాబితాలు కమిటీ నుంచి, శాఖాధిపతుల నుంచి రావాలని... ప్లేస్‌మెంట్‌ ఆర్డర్స్‌ జనవరి 1 నుంచి ఇవ్వాలని సూచించారు.

read more అలా వుండాలి.... కేవలం నావల్లే ఇసుక మాఫియాకు చెక్..: చంద్రబాబు


నవంబరు 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు

 ఇసుక సరఫరా కోసం అధికారులు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నానని సీఎం జగన్ అన్నారు.వరద నీరు తగ్గి మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని...రోజువారీ సరఫరా 97వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 1.2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ పెంచాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ ఇసుక సరఫరా పెంచుతామని...అందుకోసం నవంబరు 14 నుంచి నంబర్‌ 21 వరకు ఇసుక వారోత్సవాలు జరుపుతున్నామన్నారు.

గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌  80 వేల టన్నులు కాగా వరదలు కారణంగా, రీచ్‌లు మునిగిపోయిన కారణంగా... ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయామన్నారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగు పడిందని..1.20 లక్షల టన్నులకు రోజు వారీ సరఫరా పెరిగిందని...రీచ్‌ల సంఖ్య సుమారు 60 నుంచి 90 కిపైగా చేరిందన్నారు. 1.2లక్షల టన్నులను 2 లక్షల టన్నుల వరకూ వచ్చే వారం రోజుల్లో పెంచాలని అధికారులకు ఆయన ఆదేశించారు.

137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయింట్లు పెంచనుున్నట్లు...ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్లను ఇన్‌ఛార్జీలుగా పెట్టామని...వారే స్టాక్‌పాయింట్లను పూర్తిగా పెంచి వారోత్సవం అయ్యేలోపు 180కిపైగా స్టాక్‌ పాయింట్లు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇసుక రేటు కార్డును ప్రకటించాలని.. రేపు, ఎల్లుండిలోగా రేటు కార్డు డిసైడ్‌ చేయాలన్నారు. ఎవరైనా ప్రకటించిన రేటు కన్నా ఎక్కువకు అమ్మితే పెనాల్టీ వేయడమే కాదు, సీజ్‌ చేయడమే కాదు, 2 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

click me!