ఏపి రాజధానిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే... వైసిపికి తెలిసినా...: బోండా ఉమ

By Arun Kumar PFirst Published Feb 5, 2020, 2:19 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ కు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం ఆకలిరాజ్యంలా మారిందని... గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ  పథకాలన్నీ నిలిపివేసిన వైసిపి సర్కార్ పేదలు, మధ్యతరగతి ప్రజలపై అదనంగా ధరలభారం మోపుతోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటికే  పేదరికంతో మగ్గిపోతున్న నిరుపేదలను మరింత కుంగదీసేలా పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగించి ఆ వర్గాలు ప్రభుత్వం వీధినపడేసిందని మండిపడ్డారు.
 
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని మార్పు, పథకాలరద్దు సహా పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలపై జగన్మోహన్‌రెడ్డి పూటకోఅబద్ధం చెబుతున్నాడన్నారు. కేంద్రం నిన్నటికినిన్న ఏపీ రాజధాని అమరావతే అని స్పష్టంగా చెప్పిందని, దీనికి సంబంధించి గత ప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్రమంత్రి తేల్చిచెప్పినా వినిపించుకోకుండా జగన్‌ ఇప్పటికీ తనవాదనే నెగ్గాలనే మొండివాదనతోనే ఉన్నాడని ఉమా దుయ్యబట్టారు. 

చేతగాని పాలనావైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూనే ఉన్నాడన్నారు. 70-80 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం ఏనాడు ముంపునకు గురికాకపోయినా, మునిగిపోతుందని చెప్పడం, ఐఐటీ చెన్నై నివేదిక పేరుతో నిర్మాణాలకు పనికిరాదని దుష్ప్రచారం చేయడం, రూ.లక్షా9వేలకోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పడం జగన్‌  విషప్రచారంలో భాగమేనని ఉమా స్పష్టంచేశారు. 

read more  పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురుదాడి.: జగన్ మీద చంద్రబాబు వ్యాఖ్య

సెల్ఫ్‌ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయిన అమరావతి నిర్మాణానికి ప్రభుత్వఖజానా నుంచి రూపాయికూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేదని తెలిసికూడా జగన్‌ అదేపాట పాడుతున్నాడంటే కేవలం విశాఖలోని తనభూముల్ని అమ్ముకో  వడానికి తప్ప సాగరతీర నగరంపై ప్రేమతోకాదన్నారు. జగన్‌ నియమించిన జీ.ఎన్‌. రావు కమిటీనే విశాఖనగరం ఎందుకూ పనికిరాదని చెప్పిందని, అలాంటి  ప్రకటనల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయో ప్రభుత్వం చెప్పాలన్నారు.  

ముఖ్యమంత్రే ఇలా అబద్ధాలు చెబుతుంటే ప్రజలకు మేలు ఎలా కలుగుతుందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదాచేశామని డబ్బాలుకొట్టుకుంటున్న జగన్‌, ఖజానాకు రూపాయి కూడా మిగల్చలేదన్నారు. పోలవరం అంశంలో రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లి రూ.700 కోట్లు ఆదాచేశామంటున్న వైసీపీ సర్కారు ఇసుకధర పెరిగిందంటూ కాంట్రాక్ట్‌ సంస్థకు అప్పనంగా రూ.500కోట్లు ఇచ్చేసిందన్నారు. 

read more  తండ్రిలా ఆలోచిస్తున్నా... ఎకరాకు రూ.2కోట్లు...: అమరావతి రైతులకు జగన్ భరోసా

అధికారంలోకివస్తే సంక్షేమ పథకాల అమల్లో రికార్డులు సృష్టిస్తామని ప్రగల్భాలు పలికి మాటతప్పను మడమతిప్పనని చెప్పిన జగన్‌ సంక్షేమపథకాలు అమలుచేయకుండా అష్టవంకర్లు పోతున్నాడన్నారు.  అమ్మఒడి, వాహనమిత్ర, రైతుభరోసా పేరుతో అరకొరగా, తూతూమంత్రంగా కుడిచేత్తో నిధులిస్తూ జగన్‌ప్రభుత్వం ఎడంచేత్తో వాటిని లాగేసుకుంటోందన్నారు. 

రాష్ట్రప్రభుత్వం నిరంకుశ నిర్ణయాలు, పింఛన్లు, రేషన్‌కార్డుల తొలగింపుని నిరసిస్తూ టిడిపి తరపున ఉద్యమించనున్నట్లు తెలిపారు. వచ్చే సోమవారం రాష్ట్రంలోని అన్నినియోజకవర్గ కేంద్రాల్లో పెన్షన్లు, కార్డులు పునరుద్ధరణ కోసం ఆందోళనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు బొండా ప్రకటించారు.         

click me!