ప్రపంచం ముందు తెలుగువారి ప్రతిష్టను దిగజార్చకండి...: జగన్ కు ఎన్ఆర్ఐ జేఎసి లేఖ

By Arun Kumar PFirst Published Feb 4, 2020, 9:32 PM IST
Highlights

మూడు రాజధానులంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టనే కాదు యావత్ తెలుగు ప్రజల ప్రతిష్టను సీఎం జగన్ ప్రపంచదేశాల ముందు దిగజార్చారంటూ ఎన్ఆర్ఐ జేఎసి విమర్శించింది.  

అమరావతి: ఆంధ్ర రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎన్‌ఆర్ఐ జేఏసి ప్రకటించింది. ఈ మేరకు అమరావతి రైతుల ఆవేదనతో పాటు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు.  

ఎన్‌ఆర్‌ఐ జేఏసి ఛైర్మన్‌ కె. బుచ్చి రాంప్రసాద్‌ పేరుతో విడుదలచేసిన బహిరంగ లేఖ యదావిధిగా...

''ప్రజా రాజధాని అమరావతిని 3 రాజధానులుగా విభజిస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌తో పాటు విదేశాల్లో కూడా గత 50 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 కోట్ల ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని 28 వేల మంది రైతుల జీవనాధారమైన భూములను రాత్రింబవళ్లు క్యూలో నిలబడి ప్రజా రాజధాని కోసం ఇచ్చారు. 

దేశంలోనే కాదు ప్రపంచంలోనే 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను రైతులు స్వచ్ఛందంగా ఎక్కడా ఇవ్వలేదు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా చేసిన రైతుల త్యాగాలను గుర్తుంచుకుని అత్యుత్తమ రాజధాని నిర్మాణాన్ని చేపట్టకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ అమరావతిని నిలిపివేసి రాజధాని తరలించడం ఏమాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు.

read more  ఏపి సీఎస్ నీలం సహానికీ ఇబ్బందులు తప్పవు...: వర్ల రామయ్య హెచ్చరిక

ప్రపంచ దేశాల్లో అమరావతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. పెట్టుబడిదారులకు అమరావతి స్వర్గధామం కానున్న సమయంలో మీ చర్యలతో రాష్ట్రం అస్తవ్యస్తమవుతోంది. విదేశాల్లో తెలుగువారి ప్రతిష్టకు కూడా మాయని మచ్చగా మారింది.

రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు చేస్తున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అమరావతి ఎన్‌ఆర్‌ఐ జేఏసి పూర్తి మద్దతు తెలియజేస్తుంది. 'ఒక రాష్ట్రం-ఒకే రాజధాని' ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు అమరావతి మారుపేరుగా నిలుస్తుంది. 

read more  అమరావతి విషయంలో జోక్యం చేసుకుంటారా...?: కేశినేని ప్రశ్నపై కేంద్రం స్పష్టత

13 జిల్లాల సమగ్రాభివృద్ధికి దోహదపడే అమరావతిని కొనసాగిస్తేనే దేశవిదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. రైతుల, ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాము'' అంటూ సీఎంకు లేఖ రాసింది ఎన్ఆర్ఐ జేఏసి.

  

click me!