తండ్రిలా ఆలోచిస్తున్నా... ఎకరాకు రూ.2కోట్లు...: అమరావతి రైతులకు జగన్ భరోసా

By Arun Kumar PFirst Published Feb 4, 2020, 10:08 PM IST
Highlights

రాజధాని తరలింపు వల్ల ఏ రైతును నష్టపోనివ్వబోమని ఏపి సీఎం జగన్ తెలిపారు. రాజధాని ప్రాంత  రైతులతో జరిగిన సమావేశంలో ఆయన పలు హామిలిచ్చారు. 

అమరావతి: రాజధాని రైతులలో ఎవ్వరికీ అన్యాయం చేయ్యబోమని ఏపి సీఎం జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే తాను ప్రయత్నిస్తున్నానని... అందులో భాగంగానే రాజధానిని అన్ని ప్రాంతాలకు అందుబాటులో వుండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే అమరావతిలోనే లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ కొనసాగుతుందని గుర్తుంచుకోవాలన్నారు. 

రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లు రైతులను సీఎంను కలిపించారు.  ఎగ్జిక్యూటివ్, జుడిషియల్ రాజధాని తరలింపు వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను రైతులు సీఎం దృష్టికి  తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు తండ్రిలా ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతి అన్నది ఇటు విజయవాడా కాదు, ఇటు గుంటూరు కాదన్నారు. అమరావతి ప్రాంతంలో సరైన రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, పైపులైన్లు లేవన్నారు. 

కనీస మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. దీనికోసం లక్ష కోట్లపైనే ఖర్చు చేయాలని గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లే లెక్కకట్టారని రైతులతో తెలిపారు. 

read more  ప్రపంచం ముందు తెలుగువారి ప్రతిష్టను దిగజార్చకండి...: జగన్ కు ఎన్ఆర్ఐ జేఎసి లేఖ

మొత్తంగా గత అయిదేళ్లలో అమరావతి మీద ఖర్చుచేసింది  5,674కోట్లు మాత్రమేనని అన్నారు. బకాయిలుగా చెల్లించాల్సిందే ఇంకా రూ. 2,297 కోట్లు వున్నాయన్నారు. 
లక్ష కోట్లు అవసరమైన చోట రూ.6వేల కోట్లుపెడితే సముద్రంలో నీటి బొట్టే అవుతుందని జగన్ అన్నారు..

''మళ్లీ ఐదేళ్ల తర్వాత మళ్లీ మన పరిస్థితి ఏంటి? ఉద్యోగాల కోసం మన పిల్లలు మళ్లీ ఎక్కడకు పోవాలి?హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు పోవాలి. అదే ఖర్చులో 10శాతం విశాఖపట్నం మీద పెడితే బాగా డెవలప్‌ అవుతుంది. ఇప్పటికే విశాఖపట్నం రాష్ట్రంలో నంబర్‌వన్‌ నగరం. కనీసం వచ్చే కాలంలో అయినా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి'' అని రైతులకు నచ్చజెప్పారు జగన్. 

''ఇదే తాడేపల్లి, మంగళగిరిని మోడల్‌ మున్సిపాల్టీలుగా చేయడానికి రూ.1100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇలాంటి వాటిని వదిలిపెట్టి ఎంతపెట్టినా కనిపించని చోట రూ. 1లక్ష కోట్లు పెడితే ఏం ఉపయోగం?. అయినా సరే ఎవ్వరికీ అన్యాయం జరక్కుండా ఇక్కడే లెజిస్లేటివ్‌ కేపిటల్‌ కంటిన్యూ చేస్తామని చెప్పాం. కర్నూలులో జ్యుడిషయల్‌ కేపిటల్, విశాఖపట్నంలో కార్యనిర్వాహక కేపిటల్‌ పెడతామన్నాం'' అని వివరించారు. 

''ఇవాళ  నా ముందు రాజధాని రైతులు పెట్టిన అంశాలన్నీ కూడా నెరవేర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత. రోడ్లను డెవలప్‌ చేస్తే... రేపు ధరలు పెరిగాక రైతులే అమ్ముకుంటారు, లేదా వ్యవసాయం చేసుకుంటారు, అది వారిష్టం. రాజధానిలో మీమీ గ్రామాల్లో ఏం కావాలో.. స్పష్టంగా చెప్పండి. కనీసం 2–3 నెలల్లో పనులు ప్రారంభిస్తాం'' అని తెలిపారు.

read more  వీడియో గేమ్‌లు ఆడుకునే లోకేశ్‌ను మంత్రిని చేశారు: బాబుపై గుడివాడ వ్యాఖ్యలు

''తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీ అభివృద్ధి ప్రణాళికతో పాటు, ఈ గ్రామాల్లో పనులు కూడా ప్రారంభిస్తాం. ప్రతి ఊరికి సంబంధించి కావాల్సిన రెండు మూడు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయండి, ఆ పనులు చేద్దాం. రాజధాని గ్రామాల్లో పెన్షన్లు అందని అర్హులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించండి. వాలంటీర్ల ద్వారా అర్హులను గుర్తించండి'' అంటూ సీఎం జగన్ రైతులకు సూచించారు. 


 

click me!