రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త అందించారు. రోడ్లు మరియు భవనాల శాఖలో ఖాళీలను వెంటనే గుర్తించాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు.
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులకు గురవకుండా యుద్ధప్రాతిపదికన ఆ పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రస్తుతం అధికారులు చేయాల్సిన ముఖ్యమైన పని ఇదేనని సీఎం తెలిపారు.
రోడ్లు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో రోడ్లు, భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు , ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు, నేషనల్ హైవేస్ అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు, తదితురులు పాల్గొన్నారు. ప్రభుత్వం విడుదలచేసిన రూ. 625 కోట్లతో రోడ్లను సత్వర మరమ్మతులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. దుర్గగుడికి వచ్చే యాత్రికులు ఈ నిర్మాణ పనుల వలల్ ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.
జనవరి నెలాఖరుకు ఈ వారధిని పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు విన్నవించారు.
read more ఇసుక కొరతకు కారణం వరదలు కాదు... అసమర్థ పాలనే...: కన్నా లక్ష్మీనారాయణ
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లనూ పూర్తిచేయాలని సీఎం కోరారు. అయితే బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎం కు తెలియజేశారు.
ఆర్‌అండ్‌బీలో ఉన్న ఖాళీలను గుర్తించాలని...వాటి ఆధారంగా జనవరిలో భర్తీకోసం క్యాలెండర్ రిలీజ్ చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్యోగుల భర్తీని వీలైనంత తొందరగా చేపట్టడానికి ప్రభుత్వం పూర్తిగా పహకరిస్తుందని సీఎం ప్రకటించారు.
రోడ్ల నిర్మాణం అంచనాల విషయంలో వాస్తవికత ఉండాలని సూచించారు. మనం ప్రతిపనికీ రివర్స్ టెండర్లు పిలుస్తున్నామని...రివర్స్ టెండర్లు పిలిచిన ప్రతిసారి తక్కువకు టెండర్లు ఖరారవుతున్నాయని అధికారులకు తెలియజేశారు. రోడ్ల నిర్మాణంలో కూడా అదే పద్ధతి పాటించండని సూచించారు. ఇక్కడ కూడా రివర్స్ టెండర్లు విజయవంతం అవుతాయని సీఎం పేర్కొన్నారు.
read more ఇసుక తాత్కాలిక సమస్య మాత్రమే...ఈ నెలమొత్తం ఇలాగే...: సీఎం జగన్
సింగిల్ లేన్ రోడ్లు అనే విధానాన్ని విడిచిపెడితే మంచిదన్నారు.చేసే రోడ్ల విస్తరణ ఏదైనా రెండు లేన్ల రోడ్లుగా విస్తరిస్తేనే బాగుంటుందన్నారు. సింగిల్ రోడ్లనేవే లేకుండా విశాలంగా మరియు నాణ్యతగా రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సీఎం కోరారు.
అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. భూసేకరణపై ప్రధానంగా దృష్టిపెట్టి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్న సీఎం అధికారులను ఆదేశించారు.
ఇనీషియల్‌గా నాలుగు లేన్ల రోడ్డు, భవిష్యత్తు కోసం 8 లేన్ల రోడ్డు వరకూ భూ సేకరణ చేస్తున్నామని అధికారులు వివరించారు.
ఎక్స్‌ప్రెస్ వే లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ నాలుగులేన్లా, ఆరులేన్లా అన్నది చర్చ జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్యా ఆరులేన్లకు సరిపడా టన్నెల్స్ ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.
అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేను చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. రోడ్ల నిర్మాణంలో ఎం–శాండ్ వినియోగంపై దృష్టిపెట్టాలన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లను తొలగించడానికి కూడా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.