ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదం జగన్, చంద్రబాబు లను దాటి వారి కుటుంబసభ్యులపై దూషణలు చేసే స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకుడి కుటుంబసభ్యులపై కూడా ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ శాంతియుతంగా నిరసనకు దిగిన మహిళలపై జగన్ ప్రభుత్వం దమనకాండకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిడిపి మహిళా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య అన్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం, బూతులు తిట్టడం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమన్నారు.
ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన పాపానికి రాజధాని మహిళలపై హింసకు దిగుతారా? అని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు మహిళలపై దాడులే నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
undefined
ఈ రాష్ట్ర ఆడపడుచులకు అన్న నందమూరి తారక రామారావు బిడ్డ నారా భువనేశ్వరి రాజధాని కోసం తన చేతి గాజులు ఇస్తే అవహేళన చేస్తారా? అని ప్రశ్నించారు. మీకు సంస్కారం ఉందా? మహిళలను అవమానించిన, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై దిశ చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేశారు.
దిశ చట్టం కేవలం పబ్లిసిటీ కోసమేనా? మహిళలను కాపాడటానికి పనికి రాదా? రాజధానిలో మహిళలపై దౌర్జన్యం విషయంలో జాతీయ మహిళా కమిషనే స్పందించిందని మరి రాష్ట్ర మహిళా కమిషన్ ఏం చేస్తోందని నిలదీశారు.
అమరావతి జోలికొస్తే కేంద్రమే ఊరుకోదు... రాజధాని కాదు అదీ అసాధ్యమే: సోమిరెడ్డి
రాజధాని మహిళలు ఏనాడూ ఇంటి గడప దాటి బయటకు రాలేదని... అలా గౌరవప్రదంగా బతికే మహిళల ఇళ్లల్లోకి అర్థరాత్రి, అపరాత్రి పోలీసులు ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మహిళల ఆర్తనాదాలతో రాజధాని ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు. శాంతియుతంగా నిరసనకు దిగిన వారిని పోలీసులతో కొట్టించి వారి మెళ్లో ఉన్న గొలుసులు లాక్కునే పరిస్థితికి వైసిపి ప్రభుత్వం దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక నేరాలు చేసి కొడుకు జైలు పాలైతే రాష్ట్రమంతా తిరిగి ఓట్లు అడిగిన తల్లి, చెల్లి ఇప్పుడు రాజధాని మహిళలు రోడ్డెక్కితే ఎందుకు స్పందించడం లేదంటూ సీఎం జగన్ తల్లి విజయమ్మ చెల్లి షర్మిలలను ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు.
రాజధాని కోసం దొండపాడులో రైతు మల్లికార్జునరావు చనిపోయినా ప్రభుత్వంలో కనీస చలనం లేదన్నారు. భూములు ఇచ్చిన 29వేల మంది రైతులు మనోవేదనతో ఉన్నారన్నారు. ప్రజా రాజధానిని తరలిస్తే రాజధానితో పాటు రాష్ట్రంలోని ఆడపడుచుల శాపాలు జగన్ ప్రభుత్వానికి తగులుతాయన్నారు. వారి శాపాలతో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని అనిత, సౌమ్యలు హెచ్చరించారు.