అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయపరంగా ముందుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అందేకోసం పార్టీ లీగల్ సెల్ తో ఆయన సమావేశమయ్యారు.
విజయవాడ: జనసేన పార్టీ లీగల్ సెల్ తో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదించిన డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ది రీజియన్స్ బిల్లు, అమరావతి మెట్రో డెవలప్మెంట్ బిల్లుపై సమగ్రంగా అధ్యయనం జరిపి న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించివలసిందిగా లీగల్ విభాగానికి పవన్ ఆదేశించారు.
మంగళవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ లీగల్ విభాగంలోని సభ్యులు కేవలం న్యాయపరమైన కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని పవన్ సూచించారు. స్వాతంత్రోద్యమం ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
న్యాయవాదులు తమ మేధోశక్తి ద్వారా సమాజాన్ని ప్రగతిపధంలోకి తీసుకువెళ్లగలరని అన్నారు. ముఖ్యంగా యువత ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే పరిస్థితులను మనం కల్పించవలసి ఉందని... అందువల్ల రాజకీయ పరంగా యువత ఎదుర్కొనే వివిధ సమస్యలు, కేసుల నుంచి జనసేన న్యాయ విభాగం వారికి రక్షణ కల్పించవలసి ఉందని చెప్పారు.
పోలీసు బాధితుల వద్ద పవన్ కల్యాణ్ వేదన (ఫొటోలు)
నెలలో ఒకటి లేదా రెండుసార్లు తప్పనిసరిగా న్యాయవిభాగంతో తాను సమావేశం అవుతానని పవన్ ఈ సందర్భంగా ప్రకటించారు. జనసేన న్యాయ విభాగాన్ని శాస్త్రీయ పద్దతిలో మరింత పటిష్టంగా రూపొందించడానికి సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులను ఆయన కోరారు.
న్యాయ విభాగం సూచనల ఆధారంగా ముందుకు: నాదెండ్ల మనోహర్
లీగల్ సెల్ సమావేశంలో పాల్గొన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై న్యాయ విభాగం ఇచ్చే సూచనల ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. న్యాయ విభాగాన్ని కోర్టు ఉన్న ప్రతి ప్రాంతానికి విస్తరింప చేయాలని, అందుకు సేవా దృక్పథం, జనసేన పట్ల అభిమానం ఉన్న వారిని గుర్తించవలసిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. న్యాయ విభాగాన్ని పార్టీ కేంద్ర స్థాయిలోనూ, జిల్లాలో, మండలాల వరకు ఏ విధంగా విస్తరించవచ్చో తెలిపారు.
ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. సోమవారం రాత్రి పోలీసులు అక్రమంగా జనసేన కార్యాలయంలోకి ప్రవేశించి పార్టీ అధ్యక్షున్ని అమరావతి గ్రామాలకు వెళ్లకుండా నిరోధించినందుకు చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. తీర్మానాన్ని సీనియర్ న్యాయవాదులు సాంబశివ ప్రతాప్, సింగలూరి శాంతిప్రసాద్, గాదె వెంకటేశ్వరరావులు ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
read more
సమావేశంలో లీగల్ విభాగానికి చెందిన చోడిశెట్టి చంద్రశేఖర్, ప్రశాంతి, ఎ.కవిత, కప్పెర కోటేశ్వరరావు, వి.రమేష్ నాయుడు, కె.శివప్రసాద్, జి.మురళీకృష్ణ, ఏవీఎన్ఎస్ రామచంద్ర రావు, కోలా శ్రీహరిరావు, వై.ఆర్.ఉదయశ్రీ, సుంకర సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.