జగన్ మొండోడు... ఎవరి మాట వినడు: మహిళా మంత్రి ఆసక్తికర కామెంట్స్

By Arun Kumar PFirst Published Jan 21, 2020, 5:19 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ మంత్రి పుష్ప శ్రీవాణి అద్భుత ప్రసంగాన్ని చేశారు. ఆమె మాట్లాడున్న సమయంలో సభలోనే వున్న జగన్ స్పీచ్ ను ఆసక్తిగా విన్నారు.  

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినని మొండోడే అని రాష్ట్ర ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. జగన్ అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్.... చెప్పాడంటే, చేస్తాడంతే అన్నది దాని ట్యాగ్ లైన్ అని మంత్రి అభివర్ణించారు.  మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో అమ్మఒడి పథకంపై చర్చలో విభిన్నమైన శైలిలో సాగిన పుష్ప శ్రీవాణి ప్రసంగం అందరితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆకట్టుకుంది. 

‘‘అధ్యక్షా.. జగన్మోహన్ రెడ్డి మొండోడు, ఎవడి మాట వినడు అంటారు.. నిజమే అధ్యక్షా.. జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు.. ప్రజా సంక్షేమ నిర్ణయాల విషయంలో చాలా మొండోడు.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనే విషయంలో మొండోడు.. ఎవరి మాట వినడు.. అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల తల్లులకే ఇవ్వాలంటే ఎవరి మాటా వినలేదు.. ప్రైవేటు స్కూల్లో పిల్లలు చదివే ప్రతి పేద తల్లికీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివిస్తున్న 43 లక్షల మంది పేద తల్లులందరికీ అమ్మఒడి పథకాన్ని అందించారు'' అంటూ సీఎంను మంత్రి కొనియాడారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు, కన్నీళ్లను స్వయంగా చూసిన ప్రజా నాయకులని... అందుకే వారిద్దరూ ప్రవేశపెట్టిన పథకాలన్నీ పేదల తలరాతలు మార్చేవిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. పేదరికం పోవడానికి చదువు ఒక్కటే మార్గమని వైఎస్సార్ నమ్మారన్నారు. 

 విద్యావంతులున్న కుటుంబంలో పేదరికం ఉండదని నమ్మిన దివంగతనేత వైయస్సార్ ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉన్నత విద్యను పేదల ఇంటి గడపలోకే తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇచ్చిన మహనీయులు వైఎస్సార్ అంటూ కొనియాడారు. ఇలా వైఎస్సార్ పేద పిల్లలను ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా చదివిస్తే ఆ తండ్రి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి చదువుకున్న ఆ పిల్లలందరికీ రాజకీయాలకు అతీతంగా సచివాలయ ఉద్యోగాలను ఇచ్చి వారిని జీవితంలో స్థిరపడేలా చేసారని పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. 

read more  ఇది చారిత్రాత్మక నిర్ణయం... ఇప్పటికైనా మద్దతివ్వండి: టిడిపిని కోరిన సీఎం జగన్

తండ్రి వైయస్సార్ ఉన్నత విద్య స్థాయి నుంచి ప్రోత్సాహాన్ని అందిస్తే ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేసి ప్రాథమిక విద్యా స్థాయి నుంచే పేద పిల్లలకు బాసటగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో ఇంకా 33శాతం నిరక్షరాస్యులు ఉన్నారని.... అందుకే సినిమాహాళ్లు, హోటళ్లు, దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ చదువుకోక పనులు చేసుకుంటున్న పిల్లలు కనిపిస్తుంటారని తెలిపారు. అయితే పిల్లల బాల్యం పేదరికానికి బలైపోకూడదని బుడి బుడి అడుగులేసే ప్రతి బిడ్డా బడిలో ఉండాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. 

పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తమ పిల్లలను చదివించే ప్రతి పేద తల్లికీ 15 వేల రుపాయలను ఇచ్చే ఇంత గొప్ప పథకం దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పథకం దేశ చరిత్రలోనే ప్రథమం అన్నారు. అమ్మపాలలాగే అమ్మఒడి కూడా ఎంతో శ్రేష్టమైయిందని కితాబిచ్చారు. ఆరోగ్యానికి ఆక్సిజన్ ఎలాంటిదో, అక్షరాస్యతకు అమ్మఒడి కూడా అలాంటిదేనని అభివర్ణించారు. 

రక్తం పంచుకుపుట్టకపోయినా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికీ సొంత మేనమామ తరహాలో సీఎం జగన్ 15 వేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించారని చెప్పారు.తమ పిల్లలు ఇంగ్లీషులో గలగలా మాట్లాడుతుంటే పేద తల్లుల కనిపించే ఆనందాన్ని చూడాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలను కూడా కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 

అక్షరాస్యతకు అమ్మఒడి, నాడు నేడుతో సకల సౌకర్యాలు, కొత్త మెనూతో నాణ్యమైన భోజనాన్ని అందించడం ద్వారా అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అక్షరాస్యతలో కూడా అగ్రస్థానంలో నిలబెడతారని పుష్ప శ్రీవాణి ధీమా వ్యక్తం చేసారు. 

''బియ్యపు గింజ పాలతో కలిస్తే పాయసం అవుతుందని, ఎసరుతో కలిస్తే అన్నం అవుతుందని, పసుపుతో కలిస్తే దీవించే అక్షింత అవుతుందని, అలాగే బొగ్గుతో కలిస్తే చేతబడి చేసే బియ్యంగా మారుతుందని, ప్రజలు పాలతో కలవాలో, బొగ్గుతో కలవాలో ఆలోచించి, పాలవంటి స్వచ్ఛమైన మనసున్న జగనన్నతో కలిసి నడిచారు...'' అని మంత్రి శ్రీవాణి అభివర్ణించారు. 

read more  ఏపికి మూడు రాజధానులు... కేంద్ర ప్రభుత్వ జోక్యం వుండదు...: బిజెపి ఎంపీ జివిఎల్
 
సభలో పుష్ప శ్రీవాణి ప్రసంగం కొనసాగుతున్నంతసేపూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు చిందించారు. జగన్మోహన్ రెడ్డి చాలా మొండోడు.. ఎవరి మాటా వినడు.. అంటూ మంత్రి మాట్లాడినప్పుడు పెద్దగా నవ్వారు. ఆమె ప్రసంగం పూర్తయ్యాక ఆమె ప్రసంగాన్ని అభినందిస్తున్నట్లుగా జగన్ చిన్నగా చప్పట్లు చరిచారు. 

 

click me!