బడ్జెట్ పై ఓ కన్నేసి వుంచేందుకే ప్రజాపద్దుల కమిటీ...: స్పీకర్ తమ్మినేని

By Arun Kumar P  |  First Published Oct 23, 2019, 4:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన ప్రజాపద్దుల కమిటీ తొలి సమావేేశానికి స్పీకర్ తమ్మినేని కూడా హాజరయ్యారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  


 అమరావతి:  పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చటంలో చట్టసభల కమిటీలు అత్యంత కీలకమైన పాత్రను నిర్వహిస్తాయని శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ అన్నారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రజాపద్దుల కమిటీ ప్రారంభ సమావేశం జరిగింది. 

Latest Videos

ఈ సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ... ఈ కమిటీలలో ఆర్థిక అంశాలను పరిశీలించే ప్రజాపద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ కీలక పాత్ర నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.  బడ్జెట్ లో ఏ పద్దు ఎంత మొత్తాన్ని చట్టసభలు ఆమోదించాయో ఆ పద్దుకిందే ఆ ధనాన్ని వినియోగిస్తున్నారా లేదా అని ఈ కమిటీలే పరిశీలిస్తాయన్నారు. 

ఏవైనా అవకతవకలు జరిగినా... పన్నుల వసూళ్ల రూపంలో లోపాలున్నా గుర్తించి నివేదిక అందించే బాధ్యత ఈ కమిటీలదేనని ఆయన వివరించారు. రాజ్యాంగం ద్వారా, శాసన సభ నియమాళి ద్వారా సంక్రమించిన అధికారాలను సక్రమంగా వినియోగిస్తూ ఈ మూడు ఆర్థిక కమిటీలు తమ విధులను నిర్వహించినట్లైతే శాసనసభ కమిటీల పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆయన సూచించారు. 

నెలకి కనీసం ఒకటి రెండు సార్లు సమావేశమై ఎజెండా ప్రకారం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యనిర్వాహక వర్గము రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించేలా పర్యవేక్షించే బాధ్యత చట్టసభలకు ఇచ్చిందని వెల్లడించారు.  చట్టసభలు విధులను సక్రమంగా వ్యవహరించేందుకే కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు. 

బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని చట్టసభలు ఆమోదించాయోనని పర్యవేక్షించే బాధ్యత కమిటీలదేనని తెలిపారు. ఏ లక్ష్యాన్ని ఆశించి ఈ కమిటీలు ఏర్పడ్డాయో వాటి సాధన కోసం కమిటీ సభ్యులే పార్టీలకతీతంగా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు.

ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షులుగా నియమితులైన పయ్యావుల కేశవ్ కు, అంచనాల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీడిక రాజన్నదొరకు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అధ్యక్షులుగా నియమితులైన చిర్ల జగ్గిరెడ్డికి, ఇతర కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా సభాపతి శుభాకాంక్షలు తెలిపారు. 
అనంతరం ప్రజాపద్దుల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అధ్యక్షుల అధ్యక్షతన ప్రారంభ సమావేశం నిర్వహించారు. 

ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేరుగ నాగార్జున, కరణం ధర్మశ్రీ, జోగి రమేష్, కేవీ ఉషశ్రీచరణ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, డి. జగదీశ్వర్ రావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం లు కమిటీ సభ్యులుగా హాజరయ్యారు.  


అంచనాల కమిటీ  అధ్యక్షుడు రాజన్న దొర అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుడివాడ అమర్ నాథ్, గొర్లె కిరణ్ కుమార్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, మద్దాలి గిరిధర్ రావు, ఆదిరెడ్డి భవాని, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, వెన్నుపూస గోపాల్ రెడ్డి లు హాజరయ్యారు. 

ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన గ్రంధి శ్రీనివాస్, కిలారి వెంకటరోశయ్య, జొన్నలగడ్డ పద్మావతి, చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రవీంద్రనాథ్ రెడ్డి, డి.చంద్రశేఖర్ రెడ్డి, ఎం.వెంకట సత్యనారాయణరాజు,జి. దీపక్ రెడ్డి, సోము వీర్రాజులు హాజరయ్యారు.

 
 

click me!