వంశపారంపర్య అర్చకత్వం... చంద్రబాబు నిర్ణయమే కాపీ...: వేమూరి ఆనందసూర్య

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 6:46 PM IST
Highlights

బ్రాహ్మణ సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు వైఎస్సార్‌సిపి కలరింగ్ ఇస్తోందని బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆరోోపించారు. కేవలం చంద్రబాబు నిర్ణయాలను కాపీ కొట్టే వీరేదో ఘనకార్యం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

అమరావతి: రాష్ట్రంలోని అర్చకులకు, బ్రాహ్మణులకు మునుపెన్నడూ జరగనంత మేలు ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగిందని బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనందసూర్య పేర్కొన్నారు. గత ప్రభుత్వ జీఓను తమ ఘనతగా చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం  అర్చకుల సంక్షేమంలో కోతలు విధిస్తోందని ఆరోపించారు. టిడిపి బ్రాహ్మణుల పక్షపాతి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. 

టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమం కోసం అనేక వినూత్న, నూతన పథకాలను అమలు చేశారన్నారు. అర్చకులకు రిటైర్‌మెంట్‌ లేకుండా వంశపారపర్యంగా అర్చకత్వం చేసే హక్కును కలిగించిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు ఆలోచనను ఈ ప్రభుత్వ కాపీ కొట్టిందని ఆరోపించారు.

గతంలో టిడిపి ప్రభుత్వం జీఓ నెం.76ను సిద్దంచేసి విడుదలకు ముందు అర్చకత్వ నాయకులతో సంప్రదింపులు జరపగా... కొంతమంది 'రైట్‌ టూ అర్చకత్వం' జీఓ విడుదల కాకుండా అడ్డుపడ్డారని గుర్తుచేశారు. అలా అడ్డుకున్న వారే ఇప్పుడు అదే జీవో విడుదల తమ ఘనతగా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఈ చర్యలను అర్చక సంఘాలన్నీ గమనిస్తూ ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అర్చకులకు వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచారని... త్వరలో దాన్ని రూ. 20వేలకు పెంచనున్నట్లు ప్రకటించారని తెలిపారు. కానీ వైకాపా ప్రభుత్వం రూ.10వేలను రూ.16,500కు మాత్రమే పెంచి అర్చకులను నిలువునా మోసం చేసిందన్నారు.

అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్చకులకు కూడా అందజేసిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. అర్చకుల ప్రతి ఒక్క డిమాండ్‌ను పరిష్కరిస్తూ రాష్ట్రంలోని అర్చకులందరికీ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, దేవాదాయ శాఖలోని ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ దేవాలయాలలో పనిచేసే అర్చకులకు కూడా ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయాలని గతంలోనే చంద్రబాబు నిర్ణయించారని వెల్లడించారు.

సుమారు 15వేల మంది అర్చకులకు లబ్ధి చేకూర్చే విధంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తే.. జగన్మోహన్‌రెడ్డి ఆ సంఖ్యను కుదించి 3,600 మందికి మాత్రమే పథకాలు వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. ఇలా బ్రహ్మణ సమాజానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేవాదాయ శాఖ ఆదాయాన్ని పెంచే విధంగా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే అర్చకులు, బ్రాహ్మణులకు ఇబ్బంది లేకుండా అమరావతిలో బ్రాహ్మణ, అర్చక భవనాన్ని రెండంతస్తులలో నిర్మించాలని నిర్ణయించామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించకపోవడం బాధాకరమని... అర్చకులందరూ నిజానిజాలు తెలుసుకుని వ్యవహరించాల్సిన అవసరం వుందని ఆనందసూర్య సూచించారు.


 

click me!