కోర్టు పరిధిలో వున్నా మీకోసం సాహసం చేస్తున్నా... ఇదే నా నిబద్దత..: అగ్రిగోల్డ్ సభలో జగన్

By Arun Kumar PFirst Published Nov 7, 2019, 5:23 PM IST
Highlights

అగ్రిగోల్డ్ బాధితుల కోసం తాను పెద్ద సాహసమే చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కోన్నారు. కోర్టులో ఈ కేసు పెండింగ్ లో వుండగానే బాధితులకు చెక్కులు పంపిణీ చేయడం గురించి ఆయన వివరించారు.  

గుంటూరు :  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత కేవలం 5 నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  సుదీర్ఘ పాదయాత్రలో బాధితుల కష్టాలు, బాధలు స్వయంగా చూశానని... అందుకే ఆ సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ న్యాయం చేసే విధంగా రూ.264 కోట్లు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. దీని ద్వారా దాదాపు 3.70 లక్షల డిపాజిటర్లకు మేలు జరుగుతుందన్నారు.  

సంస్థలో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా త్వరలో న్యాయం చేస్తామన్నారు.   బాధితుల్లో ఇంకా ఎవరైనా తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, వారికి మరో నెల అవకాశం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. వారికి కూడా వచ్చే నెలలో చెల్లిస్తామని చెప్పారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు నగదు చెల్లింపు కార్యక్రమం గురువారం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. గుంటూరు పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ  కార్యక్రమంలో సీఎం లాంఛనంగా కంప్యూటర్‌ బటన్‌ నొక్కడంతో బాధితుల ఖాతాల్లోకి నగదు జమ అయింది. 

read more  అగ్రిగోల్ కుంభకోణం: బాబు, లోకేశ్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
    

సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి చెల్లించే విధంగా గత నెల 18న రూ.263.99 కోట్లు విడుదలకు ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 3,69,655 మంది అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఊరట లభించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించేలా తొలి బడ్జెట్‌లోనే రూ.1,150 కోట్లు కేటాయించారు. 

ఇవాళ(గురువారం) బాధితులకు చెల్లింపుల కార్యక్రమానికి సీఎం .జగన్‌ శ్రీకారం చుట్టారు. ముందుగా తాడేపల్లి నుంచి నేరుగా గుంటూరు చేరుకున్న సీఎం స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించారు. అనంతరం వేదికపై అగ్రిగోల్డ్‌ బాధితులకు నగదు జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

మీ అందరి కష్టా తీర్చేందుకు ఓ అన్న, ఓ తమ్ముడిలా ఇక్కడికి వచ్చానంటూ జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తనపై ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడికి పేరు పేరునా శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానని న్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు గత అయిదేళ్లుగా పడుతున్న కష్టాలు, బాధలు స్వయంగా చూశానన్నారు.

3648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో వారు తనను కలిసి బాధలు చెప్పుకున్నప్పుడు వారిని ఆదుకుంటానన్న ఒకే ఒక మాట చెప్పినట్లు గుర్తుచేశారు.  ఆ మాట నిలబెట్టుకుంటూ దాదాపు రూ.3.70 లక్షల డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు దాదాపు రూ.264 కోట్లు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. 

read more  రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. మూడు కేజీల బంగారం చోరీ

‘మీ అందరి ఆశీస్సులతో మీ తమ్ముడు ఈ పని చేయగలుగుతున్నాడు.  ఇచ్చిన మాట ప్రకారం రూ.20 వేల లోపు డిపాజిటర్లకు కూడా త్వరలో చెల్లిస్తాము. నిజానికి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. సంస్థ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నా, ఒక్కో ముడి విప్పుతూ, ఇవాళ దాదాపు 3.70 లక్షల డిపాజిటర్లకు కోర్టు అనుమతితో న్యాయం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తాము. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ కూడా కోర్టు అనుమతితో త్వరలో చెల్లిస్తాము’ అని జగన్‌ తెలిపారు.

 నిజానికి సంస్థ ప్రైవేటుదని, ఈ కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో జరిగిందని, అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.  పైగా దురాశతో ఆ సంస్థ ఆస్తులు కొట్టేయాలని చూశారని సీఎం చెప్పారు. అందుకే అగ్రిగోల్డ్‌ బాధితులను రక్షించేందుకు నాడు ప్రతిపక్షంగా పోరాడామని.. ఇప్పుడు వారికి న్యాయం చేసే దిశలో అడుగులు వేస్తున్నామని సగర్వంగా చెబుతున్నానన్నారు.     

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, బాధితులకు సహాయం చేసేందుకు  మంత్రివర్గ తొలి సమావేశం రోజే తీర్మానం చేశామన్నారు.  ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల్లో జూలై 12న బడ్జెట్‌ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆ విధంగా అధికారం చేపట్టిన  కేవలం 5 నెలల్లోనే దాదాపు 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ.264 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. 


 

click me!