ఆలుగడ్డ కూరలను పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. నిజానికి ఆ గడ్డలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన శరీరానికే కాకుండా.. చర్మానికి కూడా మంచి మేలు చేస్తాయి. అవును దీన్ని చర్మ సంరక్షణగా కూడా ఉపయోగించొచ్చు. దీన్ని చర్మానికి వాడటం వల్ల ఎన్నో చర్మ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.
చాలా మందికి ముఖంపై మొటిమల వల్ల, ఇతర కారణాల వల్ల ముఖంపై నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు అవుతుంటాయి. ఇంకొంతమందికి వీటితో పాటుగా ముఖంపై ముడతలు కూడా పడుతుంటాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఆడవాళ్లు మార్కెట్ లో దొరికే రకరకాల క్రీములను వాడుతుంటారు. అయినా ఇవి తగ్గనే తగ్గవు. కానీ ఆలుగడ్డ ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బంగాళాదుంప, పసుపు
నల్ల మచ్చలు, ముడతలను తగ్గించుకోవడానికి ఆలుగడ్డను మెత్తగా నూరండి. దీనిలో కొంచెం పసుపును కలిపి ప్యాక్ ను రెడీ చేయండి. దీన్ని ముఖానికి పెట్టి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు ముఖంపై ఉండే నల్ల ని మచ్చలను పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే ముఖంపై ఉండే ముడతలు కూడా చాలా వరకు తగ్గుతాయి.
బంగాళాదుంప, నిమ్మకాయ
బంగాళాదుంప, నిమ్మకాయ ఫేస్ ప్యాక్ కూడా ముడతలను, నల్ల మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఆలుగడ్డలను మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొంచెం నిమ్మరసాన్ని కలపండి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ వేయండి. దీన్ని వారానికి ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ లో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సి సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం నల్లబడటాన్ని తగ్గించి కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.
ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గించి ముఖాన్ని ఫ్రెష్ గా ఉంచుతాయి.
బంగాళాదుంపలోని పోషకాలు
ఆలుగడ్డలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలను, నల్ల మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అలాగే బంగాళాదుంపల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీ చర్మంపై ముడతలు తగ్గి మీరు యవ్వనంగా కనిపిస్తారు.