రోజూ జుట్టుకు నూనె పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 4, 2024, 10:40 AM IST

జుట్టుకు నూనె పెట్టడం చాలా మంచిది. కానీ రోజూ పెట్టడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మీ జుట్టు విపరీతంగా రాలడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. 

hair oiling

మా కాలంలో అయితే మేము రోజూ జుట్టుకు నూనె పెట్టుకునేవాళ్లమని అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం వినే ఉంటారు. నిజానికి జుట్టుకు నూనె పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది మన జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు తెల్లబడకుండా చేసి మంచి షైనీని అందిస్తుంది. అలాగే జుట్టులో తేమను నిలుపుతుంది. 

hair oiling


జుట్టుకు నూనె ఎంత మేలు చేసినా.. దీన్ని రెగ్యులర్ గా పెట్టడం మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవ్వరైనా సరే జుట్టుకు నూనెను సరిగ్గా పెట్టినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలను పొందుతారు. లేదంటే మీ జుట్టు ఊడిపోవడం నుంచి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

రోజూ జుట్టుకు నూనె పెట్టడం వల్ల కలిగే నష్టాలు

స్కాల్ప్ ఇన్ఫెక్షన్

జుట్టుకు నూనె రాసుకోవడంలో తప్పు లేదు. కానీ రోజూ కొన్ని గంటల పాటు జుట్టుకు నూనె ఉండటం వల్ల వెంట్రుకలు దుమ్ము, ధూళి బాగా అంటుకుపోయి పేరుకుపోతుంది. ఇది జుట్టు కణాల ద్వారా చేరి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ప్రమాదం బారిన పడేలా చేస్తుంది. జుట్టుకు నూనెను ఇలా రోజూ అప్లై చేయడం వల్ల లేదా ఎక్కువ సేపు ఉంచుకోవడం వల్ల స్కాల్ప్ ఫోలిక్యులిటిస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 


జుట్టు రాలడం

జుట్టుకు నూనె పెడితే జుట్టు రాలదని, బలంగా ఉంటుందని, ఒత్తుగా పెరుగుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ రోజూ జుట్టుకు నూనె పెడితే జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆముదం నూనె వాడే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆముదం నూనె చాలా మందంగా ఉంటుంది. ఇది మన నెత్తిమీది రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. 

సెబోరోహెయిక్ చర్మశోథ

ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం వల్ల సెబోరోహెయిక్ చర్మశోథ సమస్య వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వల్ల నెత్తిమీద చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఒక్క నెత్తిమీద మాత్రమే కాదు గడ్డం, కనుబొమ్మల వెంట్రుకల్లో కూడా చుండ్రు వచ్చే ప్రమాదం ఉంది. 
 

Image: FreePik

జుట్టుకు నూనె పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

వారానికి ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.  అలాగే చెమట ఎక్కువగా పట్టేవారు లేదా నెత్తిమీద జిడ్డు ఎక్కువగా ఉన్నవారు వారానికి ఒకసారి మాత్రమే నూనె పెట్టాలి. కొంతమంది వేడి వేడి నూనెను కూడా పెడుతుంటారు. అయితే ఎక్కువగా వేడిగా ఉండే నూనెను పెడితే మీ నెత్తిమీదుండే సహజ తేమ తొలగిపోతుంది. దీంతో మీ జుట్టు బాగా పొడిబారుతుంది. అలాగే దురద, చుండ్రు సమస్య వచ్చేలా చేస్తుంది. మీరు జుట్టుకు ఎప్పుడు నూనె పెట్టుకున్నా.. అరగంట లేదా గంట తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే జుట్టుకు నూనెను ఎక్కువ సేపు ఉంచితే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 

ఇలా నూనె పెడితే జుట్టు రాలుతుంది

ఎక్కువ నూనె

కొంతమంది ఒకేసారి జుట్టుకు బాగా నూనెను పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. నిజానికి ఈ నూనె మన జుట్టుకు తేమను అందిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ ఎక్కువ నూనె పెడితే జుట్టులో తేమ ఎక్కువ అవుతుంది. దీనివల్ల జుట్టు కుంచించుకుపోతుంది. అలాగే నెత్తి జిడ్డుగా మారుతుంది. వెంట్రుకలు కూడా బాగా తెగిపోతాయి. అంతేకాదు ఎక్కువ నూనె పెట్టడం వల్ల నెత్తిమీది రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది హెయిర్ ఫాల్ అయ్యేలా చేస్తుంది. అందుకే మోతాదులోనే జుట్టుకు నూనె పెట్టండి. 

Image: FreePik


తరచుగా నూనె పెట్టడం

జుట్టుకు నూనె పెట్టినా రాలుతుందంటే.. దానికి ప్రధాన కారణం నూనెను తరచుగా పెట్టడం. తరచుగా జుట్టుకు నూనె పెట్టడం వల్ల వెంట్రుకల బరువు పెరుగుతుంది. ఇది మీ వెంట్రుకలు తెగిపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా.. నెత్తికి, వెంట్రుకలకు దుమ్ము, ధూళి ఎక్కువగా అంటుకుంటాయి. దీంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. వారానికి 1 నుంచి 2 సార్ల కంటే ఎక్కువసార్లు జుట్టుకు నూనె అస్సలు పెట్టకండి. 

జుట్టును చాలా గట్టిగా రుద్దడం

నిజానికి జుట్టుకు నూనె పెట్టిన తర్వాత కాసేపు మసాజ్ చేయడం మంచిదే. దీనివల్ల నెత్తిమీద రక్తప్రసరణ జరిగి జుట్టు ఊడటం తగ్గుతుంది. కానీ ఈ మసాజ్ ను మరీ గట్టిగా చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాగే బాగా రాలుతుంది. ఇప్పటికే చుండ్రు లేదా చర్మశోథ సమస్యలు ఉంటే.. అవి మరింత ఎక్కువ అవుతుంది. అందుకే జుట్టుకు నూనెను పెట్టిన తర్వాత చాలా సున్నితంగా మసాజ్ చేయాలి.  

హెయిర్ ఆయిల్ ను ఎక్కువసేపు ఉంచడం

చాలా మంది జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టి ఉదయం స్నానం చేస్తుంటారు. కానీ ఇలా నూనెను ఎక్కువసేపు ఉంచితే నెత్తిమీది రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే నెత్తిమీద బ్యాక్టీరియా లేదా ఫంగల్  ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది మీ జుట్టు మూలాలను బలహీనంగా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. నూనె పెట్టిన 3 నుంచి 4 గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. 

Latest Videos

click me!