మనం ముఖ సౌందర్యాన్నికాపాడుకోవడంలో కనుబొమ్మ వెంట్రుకలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కొంతమందికి కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే.. మరికొంతమందికి పల్చగా ఉంటాయి. అయితే చాలా మందికి కనుబొమ్మల వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. కనుబొమ్మల వెంట్రుకలు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటి? అవి రాలకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పోషకాహార లోపం
మన శరీరానికి పోషకాలు చాలా చాలా అవసరం. పోషకాలు శరీరంలో బాగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా, బలంగా, ఎనర్జిటిక్ గా ఉంటాం. అయితే ఈ పోషకాలు లోపిస్తే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా కనుబొమ్మల వెంట్రుకలు కూడా రాలిపోతాయి. అందుకే మీరోజువారి ఆహారంలో ఐరన్, జింక్, విటమిన్ బి 12, విటమిన్ డి వంటి పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.
హార్మోన్ల మార్పులు
ఆడవారి శరీరంలో హార్మోన్ల మార్పులు రావడం చాలా కామన్. దీనివల్ల మూడ్ స్వింగ్స్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ హార్మోన్ల మార్పుల వల్ల కూడా కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి
ప్రస్తుత కాలంలో ఒత్తిడి లేని వారు అసలే ఉండరేమో. కానీ విపరీతమైన ఒత్తిడి, యాంగ్జైటీ మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. వీటివల్ల కనుబొమ్మల వెంట్రుకలు కూడా విపరీతంగా రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించి కనుబొమ్మలు రాలకుండా చేయొచ్చు. ఇందుకోసం.. మీరు నూనెను వేళ్లకు అంటించుకుని కనుబొమ్మలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కనుబొమ్మల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
కొబ్బరి పాలు
కొబ్బరి పాలతో కూడా మీరు కనుబొమ్మల వెంట్రుకలు రాలకుండా చేయొచ్చు. ఇందుకోసం మీరు కాటన్ బాల్ ను తీసుకుని కొబ్బరి పాలలో ముంచండి. వీటిని మీ కనుబొమ్మలపై పెట్టండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలపై వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
ఆముదం నూనె
ఆముదం నూనె జుట్టుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మీరు కనుబొమ్మల వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే.. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు ఆముదం నూనెను అప్లై చేయండి. ఇది కనుబొమ్మలపై జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది.