
మహిళలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూ ఉంటాయి. అయితే, మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్ ని ఒక అంటరానిదానిగా చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పూజలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు లాంటి వాటికి పీరియడ్స్ వచ్చిన వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. బయట వాటికైతే దూరంగానే ఉంటాం. కానీ.. ఇంట్లో ఫంక్షన్ అయితే అలా దూరంగా ఉండలేక.. ఆ పీరియడ్స్ ఆలస్యం కావడానికి మందులు వేసుకుంటూ ఉంటారు. ఏ మెడికల్ షాప్ కి వెళ్లినా ఈజీగా దొరికే ఈ ట్యాబ్లెట్ ఇటీవల ఓ యువతి ప్రాణం తీసింది.
యువతి చనిపోయిన ఘటన అందరినీ షాకింగ్ గురి చేసింది. పదిలో ఆరుగురు పీరియడ్స్ ఆగడానికి ఎప్పుడో ఒకసారి ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నవారే. అలాంటి ట్యాబ్లెట్ ఓ యువతి ప్రాణాలు నిమిషాల్లో గాల్లో కలిసిపోయేట్లు చేసింది. ఈ ఘటన తర్వాత.. వైద్యులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇదే విషయంపై బెంగళూరుకు చెందిన డాక్టర్ వివేకానంద్ మాట్లాడారు.
ఇలాంటి మందులు వాడటం ల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి (థ్రాంబోసిస్) చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. సదరు యువతి కూడా..ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో పీరియడ్స్ వాయిదా వేయడానికి మాత్రలు వేసుకుంది. కొద్దిసేపటికే ఆమెకు తీవ్రమైన కాలు నొప్పి, వాపు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో ఒకచోట రక్తం గడ్డకట్టి, అది నేరుగా ఊపిరితిత్తులకు లేదా మెదడుకు చేరి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీనివల్ల మరణం సంభవిస్తుందని డాక్టర్ వివరించారు.
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో గైనకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం సూరి కూడా మహిళలను హెచ్చరిస్తున్నారు. 'పీరియడ్స్ వాయిదా వేసే హార్మోన్ల మందులు విరివిగా దొరుకుతున్నాయి. పరీక్షలు, పెళ్లిళ్లు, ప్రయాణాలు లేదా పెద్ద ఫంక్షన్ల ముందు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మాత్రలు సౌకర్యంగా అనిపించినా, వాటితో ప్రమాదం లేదని కాదు. కొన్ని సందర్భాల్లో ఇవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (వీనస్ థ్రాంబోసిస్) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి' అని అన్నారు.
ఈ హార్మోన్ల మాత్రల వల్ల వచ్చే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్.. రక్తంపై వాటి ప్రభావమే. ఇవి రక్తం గడ్డకట్టే స్వభావాన్ని పెంచుతాయి. రక్తాన్ని చిక్కగా మార్చి, రక్తనాళాల లోపల గడ్డకట్టేలా చేస్తాయి. ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో ఈ ప్రమాదం తక్కువే. కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి లేదా కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి చరిత్ర ఉన్నవారికి ఈ మాత్రలు చాలా ప్రమాదకరం.
ఈ మాత్రలు వేసుకున్న వాళ్లంతా చనిపోతారని కాదు. అందరికీ ప్రమాదం ఒకేలా ఉండదు. ఊబకాయం, వ్యాయామం లేని జీవనశైలి, ధూమపానం, నియంత్రణలో లేని డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ మాత్రలు చాలా ప్రమాదకరం. కుటుంబంలో ఎవరికైనా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నా రిస్క్ ఎక్కువే. అందుకే… ఎలాంటి మందులు అయినా డాక్టర్స్ సలహా తీసుకున్న తర్వాతే వాడాలి.