కూరగాయలు తొందరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Mar 25, 2024, 1:19 PM IST

ఎండాకాలంలో కూరగాయలు ఇంకా తొందరగా పాడైపోతుంటాయి. అయితే వీటిని కొన్ని పద్దతుల్లో స్టోర్ చేస్తే చాలా రోజుల వరకు కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి. అదెలాగంటే? 
 

మాంసాహారాల్లోనే కాదు కూరగాయల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అన్నం కంటె కూరగాయలనే ఎక్కువగా తినాలని చెప్తుంటారు. అయితే కూరగాయలను వారానికి సరిపడా తెచ్చినప్పుడు అందులో చాలా వరకు తొందరగా పాడైపోతుంటాయి. ఎక్కువ రోజులు ఉంటే అంతే. కానీ చాలా మటుకు స్టోర్ చేయడం రాకపోవడం వల్ల కూడా కూరగాయలు తొందరగా పాడవుతాయి. చాలా మంది కూరగాయలు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్ లో పెడుతుంటారు. అయినా కూడా కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలాంటి సమస్య చాలా మందికి ఎదురవుతుంటుంది. మరి కూరగాయలను ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

1. ఎప్పుడైనా సరే పండ్లను, కూరగాయలను కలిపి అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే చాలా రకాల పండ్లు ఇథిలీన్ అనే వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు కూరగాయలు త్వరగా మగ్గడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల కూరగాయలు ఒకటిరెండు రోజుల్లోనే పాడైపోతాయి. అందుకే కూరగాయలను, పండ్లను ఎప్పుడూ కూడా సపరేట్ గానే ఉంచాలి. అలాగే కూరగాయలు తాజాగా ఉండాలంటే వాటికి గాలి తగలకుండాచూసుకోవాలి. 


2. ఉల్లిపాయలు కూడా తొందరగా పాడైపోతుంటాయి. ఇవి చాలా కాలం నిల్వ ఉండాలంటే మాత్రం గాలి, వెలుతురు వచ్చే విధంగా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అలాగే ఉల్లిపాయలను, బంగాళాదుంపలు ఎప్పుడూ కూడా కలిపి ఉంచకూడదు. అలాగే ఎండ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉల్లిపాయలను ఉంచకపోవడమే మంచిది.

3. బచ్చలికూర ఉదయం తెస్తే సాయంత్రం వరకు వాడిపోయి వండుకోవడానికి పనికిరాకుండా పోతుంది. ఇది చాలారోజుల పాటు ఫ్రెష్ గా ఉండాలంటే దీనిని మందపాటి వార్తాపత్రికలో చుట్టి తడి టవల్ లో పెట్టండి. టవల్ అదనపు తేమను గ్రహిస్తుంది. దీతో  తాజాదనం కొన్ని రోజులు ఉంటుంది.
 

4. వెల్లుల్లి ఎక్కువ రోజులు రావాలంటే మాత్రం దీన్ని నిల్వ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వెల్లుల్లిని ఎప్పుడూ కూడా గాలి,  వెలుతురు వచ్చే ప్రదేశంలోనే పెట్టాలి. 
 

5. మిగతా కూరగాయల కంటే పచ్చిమిర్చి చాలా తొందరగా పాడవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా మొదటగా పచ్చిమిర్చి కాండంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం కాండం తీసేయాలి. అలాగే ఏవైనా దెబ్బతిన్న, పాడైన పచ్చిమిరపకాయలు ఉన్నా వాటిని తీసేయండి. లేదంటే ఇతర మిరపకాయలు కూడా పాడైపోతాయి. 
 

6. కొత్తిమీర చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉండాలటే కొత్తిమీర కట్టలను ఇంటికి తెచ్చిన వెంటనే వాటి వేర్లను కట్ చేసుకోవాలి.అలాగే మంచి నీటితో కొత్తిమీరను శుభ్రం చేసుకోవాలి.  తర్వాత తడిపిన పేపర్ టవల్ లో కొత్తిమీరను పెట్టి నిండా కప్పండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడితే కొత్తిమీర చాలా ఫ్రెష్ గా ఉంటుంది. 

Latest Videos

click me!