ఒకప్పుడైతే తెల్ల వెంట్రుకలు 40, 50 ఏండ్లవారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికీ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. కానీ ఈ తెల్ల వెంట్రుకలు జుట్టు అందాన్ని తగ్గించేస్తాయి. ముసలివాళ్లలా కనిపించేలా చేస్తాయి. అందుకే తెల్ల జుట్టు ఉన్న ప్రతి ఒక్కరూ నల్ల రంగును వేస్తుంటారు. కానీ ఈ రంగు కొన్ని రోజుల్లోనే పోతుంది. కానీ పదేపదే కెమికల్ కలర్స్ ను జుట్టుకు వేయడం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది.
కలర్స్ వల్ల జుట్టు రాలడం, డ్రైగా మారడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇక నుంచి కెమికల్ కలర్స్ ను జుట్టుకు వాడటం మానేయండి. నిజానికి రంగు వేయకుండానే జుట్టును నల్లగా చేయొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎలాంటి కష్టం లేకుండా ఇంట్లోనే నల్లని, అందమైన జుట్టుకోసం హెయిర్ డై ని తయారుచేయొచ్చు. ఇందుకోసం కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది. తెల్ల జుట్టును నల్లగా చేసే నూనెను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టుకు కొబ్బరి నూనె ప్రయోజనాలు
కొబ్బరి నూనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన చర్మానికి, జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే దీన్ని ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. కొబ్బరి నూనెను కేవలం వంటకు మాత్రమే కాకుండా.. జుట్టు, చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగించొచ్చు.
నల్ల మిరియాల వాడకం
నల్ల మిరియాలు తెలియని వారు ఉండరు. ఇవి ఒక మసాలా దినుసు. దీన్ని ఫుడ్ రుచి పెంచడానికి వంటల్లో బాగా ఉపయోగిస్తాం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇది మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అవును దీన్ని ఉపయోగించి తెల్లని జుట్టును నల్లగా చేయొచ్చు. మీకు తెలుసా? నల్ల మిరియాలు సహజంగా మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జుట్టు తెల్లబడటం తగ్గుతుంది.
ఉసిరి పొడి
ఉసిరికాయ మన ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉసిరిపొడితే తెల్ల జుట్టును తగ్గించుకోవచ్చు. వెంట్రుకలను నల్లగా నిగనిగలాడేలా చేయొచ్చు. జుట్టుకు ఉసిరి పొడిని పెట్టడం వల్ల మన జుట్టు స్ట్రాంగ్ గా, షైనీగా మారుతుంది. ఉసిరికాయను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
కరివేపాకు ప్రయోజనాలు
కరివేపాకును మనం ప్రతి వంటలో వేస్తుంటాం. ఈ కరివేపాకు వంటలకు మంచి వాసనను, రుచిని అందిస్తుంది. అంతేకాదు ఇది మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం..కరివేపాకును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. అలాగే హెల్తీగా జుట్టు నల్లగా మారుతుంది.
కొబ్బరి నూనె డై మేకింగ్ మెటీరియల్స్
తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు.. ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి. దీనిలో టీస్పూన్ నల్ల మిరియాల పొడిని వేయండి. అలాగే దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని, 10 నుంచి 12 కరివేపాకు రెబ్బలను వేసి బాగా కలపండి. దీన్ని తక్కువ మంటమీద 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించండి. ఇది చల్లార్చి వడకట్టి ఒక కంటైనర్ లో నిల్వ చేయండి. దీన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయండి. 1 నుంచి 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. దీన్ని మీరు తలస్నానం చేసినప్పుడల్లా పెడితే మంచి ఫలితం ఉంటుంది.