టీ, కాఫీలను తాగే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే కొంతమంది టీని తాగితే.. మరికొంతమంది కాఫీని తాగుతుంటారు. టీ కంటే చాలా మంది కాఫీనే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంటుంది మరి. అప్పుడే తయారుచేసిన కాఫీ మన మూడ్ ను మార్చేస్తుంది. మన శరీరాన్ని ఎనర్జిటిక్ గా, రీఫ్రెష్ గా చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో వేడివేడి కాఫీ తాగుతుంటే వచ్చే ఆ అనుభూతే వేరు. చాలా మంది ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఫీలవుతారు.
కాఫీని కాఫీ పౌడర్ తో తయారుచేస్తామన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కాఫీ పొడి కాఫీ గింజలతో తయారువుతుంది. మనలో ప్రతి ఒక్కరూ కాఫీ పొడిని మార్కెట్ నుంచే కొంటుంటారు. కానీ కాఫీ గింజలతో మనమే ఇంట్లోనే చాలా సులువుగా కాఫీ పొడిని తయారుచేయొచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మరి కాఫీ గింజలతో కాఫీ పొడిని ఇంట్లోనే ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాఫీ పౌడర్ ను ఎలా తయారుచేయాలి?
మీరు పెద్దగా కష్టపడకుండా, గంటల తరబడి టైం కేటాయించకుండా చాలా సింపుల్ పద్దతిలో కాఫీ పొడిని తయారుచేయొచ్చు. ఈ కాఫీ పొడిని తయారుచేయడానికి కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీనికోసం మిక్సీ గ్రైండర్, కాఫీ గింజలు, ఒక స్ట్రెయినర్ కావాలి. ముందుగా గుప్పెడు కాఫీ గింజలను తీసుకుని మిక్సీలో వేయండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత వడకట్టి గాలి వెళ్లని డబ్బాలో వేయండి.
రెండో చిట్కా..
కాఫీ మరింత టేస్టీగా కావాలంటే ఇలా కాఫీ పౌడర్ ను తయారుచేయండి. దీనికోసం కాఫీ గింజలు, స్టార్ సోంపు, ఒక మిక్సీ గ్రైండర్ అవసరమవుతాయి. ముందుగా కాఫీ గింజలను, స్టార్ సోంపును కొద్దిగా వేయించండి. ఆ తర్వాత ఈ రెండింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత వడకట్టి గాలివెళ్లని డబ్బాలో స్టోర్ చేయండి.
దీనివల్ల కాఫీ పొడి పాడవుతుంది
కాఫీ పొడి తొందరగా పాడవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పొడి తేమను, వాసనను బాగా గ్రహిస్తుంది. అంటే ఇది దానిచుట్టుపక్కలున్న వాటిని గ్రహిస్తుంది. ఒకవేళ కాఫీ పౌడర్ డబ్బాలోకి తేమ వెళితే అతి వెంటనే గట్టి పడి పనికి రాకుండా అవుతుంది. అందుకే కాఫీ పొడిని తేమకు, ఇతర పరిసరాలకు దూరంగా ఉంచండి. అప్పుడే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
కాఫీ పొడిని ఫ్రిజ్ లో పెట్టకూడదు
తెలియక చాలా మంది మిగతా వాటితో పాటుగా కాఫీ పొడిని కూడా ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ కాఫీ పొడిని ఫ్రిజ్ లో మాత్రం పెట్టకూడదు. మీరు ఇంట్లో తయారుచేసిన కాఫీ పౌడర్ ను చిన్న బ్యాచ్ లుగా ఏర్పాటు చేయండి. దీనివల్ల కాఫీ పొడి చెడిపోదు. అలాగే దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల దాంట్లోకి తేమ వెళ్లి కాఫీ పొడి గట్టిపడుతుంది.
పొడి ప్రదేశంలో ఉంచండి
కాఫీ పొడి నెలల తరబడి వాడాలనకుంటే మాత్రం మీరు దీన్ని పొడి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. తేమగా ఉన్న ప్రదేశంలో పెడితే ఒక నెలరోజుల్లోనే పాడవుతుంది. అందుకే కాఫీ పొడిని ఎప్పుడూ కూడా గది ఉష్ణోగ్రత వద్ద, డ్రై ప్లేస్ లో నిల్వ చేయండి.