కోడి గుడ్డుతో కలిగే ప్రయోజనాలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మాంసాహారం తినని వారు కూడా ఎంతో మంది కోడి గుడ్డు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక విటమిన్ బీ12కి కూడా కోడి గుడ్డు పెట్టింది పేరు. తక్షణ శక్తి అందించడంలో కూడా కోడి గుడ్డు కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
ఇక ఎక్కువ పోషకాలు ఉండే కోడిగుడ్డులో కేలరీలు తక్కువగా ఉండడం విశేషం. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా కోడు గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే కోడి గుడ్డులో ఫోలేట్, విటమిన్ A, విటమిన్ B5, B12, ఫాస్పరస్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గర్భిణీలు కూడా కచ్చితంగా గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుడ్డు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
పచ్చి గుడ్డు విషయంలో..
మనలో కొందరు పచ్చి గుడ్లను తీసుకుంటుంటారు. అయితే వీటిలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజింగ్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నాటు కోడి గుడ్లను పచ్చిగా తింటే మంచిదని భావిస్తుంటారు. నిజానికి శరీరానికి 90 శాతం ప్రోటీన్లు బాగా ఉడికిన గుడ్డు నుంచే లభిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పచ్చి గుడ్డు ద్వారా కేవలం 50 శాతం ప్రోటీన్లు మాత్రమే లభిస్తాయి. అందుకే పచ్చి గుడ్డు కంటే ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవడమే ఉత్తమం అనేది నిపుణుల సూచన.
ఏ సమయంలో తీసుకోవాలి.?
గుడ్లను తీసుకునే సమయం విషయంలో కూడా పలు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి కంటే ఉదయం గుడ్డు తినడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం గుడ్డును తీసుకుంటే.. కండరాలు కోలుకుంటాయి. అయితే బరువు పెరగాలనుకునే వారు రాత్రిపూట గుడ్డును తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.