ఇదేం విచిత్రం.. శాండ్ విచ్ కట్ చేసినందుకు రూ. 182 బాదిన రెస్టారెంట్.. ఎక్కడంటే..

First Published | Aug 11, 2023, 10:03 AM IST

ఇటలీలో వింత ఘటన వెలుగు చూసింది. శాండ్ విచ్ కట్ చేయమన్నందుకు.. దానికి కూడా బిల్ వేసి కస్టమర్ కు చుక్కలు చూపించారు. 

ఇటలీ : రెస్టారెంట్ కు వెళ్లామా.. హాయిగా ఇష్టం వచ్చింది ఆర్డర్ ఇచ్చి ప్రశాంతంగా తిన్నామా.. ఇది నేటి రోజుల్లో నూటికి తొంభైశాతం చేసేదే. కొంతమంది అకేషనల్ గా అప్పుడప్పుడూ వెడితే.. మరికొందరు వారంలో నాలుగైదు రోజులు అదే పనిలో ఉంటారు. టైం లేకనో.. వండుకోలేకనో అది వేరే విషయం. అయితే.. మనం ఆర్డర్ ఇచ్చింది ఇచ్చినట్టుగా.. బిల్లు చెప్పింది చెప్పినట్టుగా పడితే సమస్యే లేదు. 

కానీ ఆర్డర్ లో ఉన్న దానికి చిన్న ఫేవర్ అడిగినా.. అది బిల్లులో మోత మోగితే.. తిన్న సంతృప్తి ఏమో కానీ.. చిరాకు నషాళానికి అంటుతుంది. అలాంటి ఘటనే జరిగింది ఇటలీలో. ఓ కేఫ్ కు వెళ్లి ఓ వ్యక్తి శాండ్ విచ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే దాన్ని ముక్కలుగా కట్ చేయమని కోరాడు. దీనికి వారు ఏకంగా బిల్లును మోత మోగించారు.


శాండ్ విచ్ కట్ చేయడానికి అదనంగా.. రూ.182 వసూలు చేశారు. దీంతో అతను అవాక్కయ్యారు. ఈ ఘటన ఇటలీలోని లేక్ కోమోకు సమీపంలో ఉన్న ప్రముఖ హాలిడే స్పాట్ అయిన గెరా లారియోలోని బార్ పేస్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ శాండ్ విచ్ ఆర్డర్ చేసిన ఓ గుర్తు తెలియని పర్యాటకుడు శాండ్ విచ్ "సగం కట్ చేసి ఇవ్వమన్నందుకు" అతని బిల్లులో రూ. 182 వసూలు చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. 

గ్రిల్డ్ శాండ్‌విచ్ ధర.. దాన్ని కట్ చేయమన్నందుకు వేసిన ధరలున్న బిల్ ఫొటోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. "టోస్ట్ సగానికి కట్ చేసినందుకు కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందా?" అని తన ఆశ్చర్యాన్ని. అవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

బిల్లు ప్రకారం, వివాదాస్పద శాండ్‌విచ్ కట్టింగ్ ధర శాండ్‌విచ్ మొత్తం ధరను అక్కడి కరెన్సీ.. 7.50.. 9.50కి పెంచింది, ఇది ఒక కప్పు ఎస్ప్రెస్సో ధర కంటే ఎక్కువ. కేఫ్ యజమాని, క్రిస్టినా బియాచి దీని మీద మాట్లాడుతూ.. ఇలా అదనపు అభ్యర్థనలకు ఖర్చులు ఉంటాయని వివరించారు. అతను చేసిన అభియోగాన్ని సమర్థించారు.

బియాచి మాట్లాడుతూ అతను అడిగిన దాన్ని బట్టి ఒక ప్లేట్‌కు బదులుగా రెండు ప్లేట్‌లను ఉపయోగించడం, వాటిని కడగడానికి సమయం, కృషి వీటికి డబ్బులు ఖర్చు అవుతాయని సమర్థించుకుంటూ చెప్పుకొచ్చారు. శాండ్‌విచ్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయని, కట్ చేయడానికి అదనపు సమయం అవసరమని కూడా ఆమె పేర్కొన్నారు.

ఆ సమయంలో కస్టమర్ ఫిర్యాదును లేవనెత్తినట్లయితే, బిల్లు నుండి ఛార్జీ తీసివేయబడుతుందని బియాచి తెలిపారు. అయితే, ఇలాంటి సంఘటనలు ఇటలీలో ఇది మొదటిసారేం కాదు, పర్యాటకులు భోజనం విషయంలో అధిక ధరల గురించి గతంలో కూడా ఫిర్యాదు చేశారు. ఇటలీలోని పర్యాటకులకు భోజన ఛార్జీల అంశం ఆందోళనకరంగా మారుతోంది. 

Latest Videos

click me!