వైరల్ వీడియో : పాములకు తలస్నానం చేయించాడు.. పట్టుకుని డబ్బాలో వేశాడు...

First Published | Aug 12, 2023, 10:12 AM IST

పాములకు ఎంచక్కా తలస్నానం చేయించాడో వ్యక్తి. వాటి పడగలపై మగ్గుతో నీళ్లు పోస్తూ ఏమార్చి.. వాటిని పట్టేశాడు. 

పాము కనబడితే చాలు అది విష సర్పమా? మామూలు పామా? అని తెలియదు కానీ..ఆ మాట వినగానే ఆమడ దూరం పరిగెడుతుంటారు. పాము అంటే జనాల్లో అంత భయం నెలకొని ఉంది. కొంతమంది.. అంటే కాస్త ధైర్యవంతులు సురక్షితమైన దూరంలో నిలబడి పాముని చూస్తుంటారు.

ఇక మరికొంతమంది ఉంటారు వారికి ఎలాంటి భయం ఉండదు. ఏకంగా  ఆ పాముల తోకలు పట్టుకుని ఆటలాడుతుంటారు.మెడలో వేసుకుని  పోజులిస్తుంటారు.


snake

ఇక స్నేక్ క్యాచర్స్ అయితే..  ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఎలాంటి విషపూరితమైన  పామునైన  అలవోకగా పట్టేస్తుంటారు. ఈ స్నేక్ క్యాచర్లకు పాములు పట్టుకునే పద్ధతిలోనూ వారిదైన శైలి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన టెక్నిక్స్ తో పాములను పట్టుకుంటుంటారు. 

పాములను పట్టుకునే సమయంలో వీడియోలు తీసి నెట్టింట్లో పెట్టడం అలవాటే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలా ఇటీవల కాలంలో ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఓ వ్యక్తి పాములని పట్టుకునే విధానం చూసి నేటిజన్లందరూ  షాక్ అవుతున్నారు. అతను పట్టుకోవడానికి వచ్చినప్పుడు పాములన్ని మంత్రం వేసినట్టుగా అతని చేతికి చిక్కడం చూసి.. ‘ ఏ మంత్రం వేసాడో..  ఏమో..’  అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒకరి ఇంట్లోకి రెండు నాగుపాములు వచ్చాయి. భయపడిపోయిన ఆ ఇంటివారు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఇంటికి వచ్చిన అతనికి.. రెండు నాగుపాములు కనిపించాయి.  సాధారణంగా స్నేక్ క్యాచర్లు…పాములను పట్టుకోవడానికి స్నేక్ కేచింగ్ స్టిక్ ను ఉపయోగిస్తారు. 

అయితే, ఇతను మాత్రం దానిని వాడకుండా.. వెరైటీగా పట్టుకోవాలని ప్రయత్నించాడు. దీనికోసం ముందుగా అతను ఓ ప్లాస్టిక్ మగ్గుతో నీళ్లు తీసుకున్నాడు. ఆ నీటితో నాగుపాములకు వద్దకు వెళ్లాడు. ఎలాంటి భయం లేకుండా తమ దగ్గరికి వస్తున్న అతన్ని చూడగానే రెండు పాములు పడగవిప్పి బుసలు కొట్టాయి.

అతను ఏమాత్రం భయపడకుండా..  పడగలు విప్పిన పాముల తలల మీద మగ్గులోను నీటిని పోశాడు. అలా అతను నీళ్లు పోస్తూనే ఉన్నాడు. నీటిని పోస్తున్నంత సేపు ఆ పాములు ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయాయి. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అలా నీటిలో జలకాలాడడం తమకు ఎంతో ఇష్టమైనట్టుగా పాములు మిన్నకుండిపోవడం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అతను నీళ్లు పోస్తున్న క్రమంలోనే మెల్లమెల్లగా చేతిని పాము దగ్గరికి తీసుకెళ్లాడు.  అయినా కూడా అవి కాటు వేసే ప్రయత్నం చేయలేదు. 

cobra snake

అలా కొద్దిసేపు వాటి పడగల మీద నీళ్లు పోసిన తర్వాత.. పాములు కాస్త పరాధ్యానంగా ఉన్నాయనిపించిన సమయంలో ఒకసారిగా.. చాకచక్యంగా వాటిని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. దీనికి సంబంధించిన వీడియోను చూసిన సోషల్ మీడియాలోని వారంతా అతని నైపుణ్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫన్నీ కామెంట్స్ తో వీడియోను హోరెత్తిస్తున్నారు. ‘ఈ పాములకు స్నానం చేయడం అంటే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది’.. అని ఒకరంటే.. ‘ఇదేందయ్యా ఇది…ఇదేం టెక్నిక్? నాగుపాములను కాస్త.. వాన పాములను చేసావు కదా..’ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో..‘ఇలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిది’  అంటూ హెచ్చరిస్తున్నారు.

Latest Videos

click me!