భార్యకు ప్రేమ పరీక్ష.. విషం తాగిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే...

First Published | Jul 5, 2023, 9:34 AM IST

భార్యకు తనమీద ఎంత ప్రేముందో తెలుసుకోవాలనుకున్నాడో భర్త.. దానికోసం ఓ విచిత్రమైన పరీక్ష పెట్టాడు. దీంతో ఇద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. 

ఉత్తర ప్రదేశ్ : ఓ వ్యక్తి తన మీద తన భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. దీనికోసం ఓ పిచ్చి పనికి పూనుకున్నాడు. దీంతో ఇద్దరి ప్రాణాలు అపాయంలో పడ్డాయి. తీవ్ర అస్వస్థత పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య మీద అనుమానంతోనో.. ప్రేమతోనో.. మరే కారణంతోనో ఆ భర్త చేసిన పని ఇప్పుడు నెటిజెన్ల ఆగ్రహానికి గురైంది. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే…

తన భార్యకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ఓ వింత పరీక్ష పెట్టాడు ఆమెకి. ఒకవేళ తాను హఠాత్తుగా చనిపోతే.. నువ్వేం చేస్తావ్ అంటూ అడిగాడు.. ఆమె కూడా చనిపోతానని చెప్పింది. దీంతో వెంటనే  అతను విషం తాగాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె కూడా విషం తాగింది. ఇద్దరు పరిస్థితి విషమించడంతో గమనించిన వారు వెంటనే ఆసుపత్రిలో చేర్చగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.


ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బండాలోని బాబేరు పోలీస్ స్టేషన్ పరిధి హార్దౌలీ గ్రామంలో చోటుచేసుకుంది. హార్దౌలీ గ్రామానికి చెందిన నిజాముద్దీన్, రిజ్వానా భార్యాభర్తలు. వీరిద్దరిది అన్యోన్య దాంపత్యం.  ఎలాంటి సమస్యలు, చీకూ చింతా లేకుండా సంతోషంగా జీవించేవారు.

ఈ క్రమంలోనే భర్తకి ఓ విచిత్రమైన కోరిక పుట్టింది. భార్యకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అసలు నిజంగా భార్య తనను ప్రేమిస్తుందా అని అనుమానం వచ్చింది. దీంతో ఆమెను ‘నామీద నీకు ప్రేమ ఉందా?  నేను చనిపోతే నువ్వు చచ్చిపోతావా?’ అంటూ అడిగాడు. 

దీనికి ఆ అమాయకపు భార్య నీకోసం నా ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధమే అంటూ సమాధానం చెప్పింది. అయినా ఆ భర్త అనుమానం తీరలేదు. ప్రాక్టికల్ గా తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే నిజాముద్దీన్ విషం తాగేశాడు. భర్త చేసిన పనికి ఒక్కసారిగా రిజ్వానా షాక్ కు గురైంది.  వెంటనే నలుగురిని పిలిచి హాస్పిటల్కు తీసుకెళ్లాల్సింది పోయి.. తాను కూడా విషం తాగేసింది.

దీంతో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కాసేపటికి చుట్టుపక్కల వారు ఇది గమనించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చూసారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.  ప్రస్తుతం వీరిద్దరికీ చికిత్స జరుగుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజెన్లు.. భర్త మీద  తీవ్రంగా మండిపడుతున్నారు.

Latest Videos

click me!