భారత్ నుంచి యూరప్ కు సైకిల్ ప్రయాణం.. స్వీడిష్ భార్య కోసం భారత వ్యక్తి సాహసం.. ఎలాగంటే..

First Published | May 25, 2023, 11:09 AM IST

మహానందియా అనే ఓ వ్యక్తి తన స్వీడిష్ భార్య కోసం సైకిల్ మీద యూరప్ కు వెళ్లాడు. ప్రతిరోజూ దాదాపు 70 కి.మీ సైకిల్‌ తొక్కుతూ ఎట్టకేలకూ ఆమెను చేరుకున్నాడు. ఈ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది. 

ప్రేమకు ఎల్లలు లేవు, పేదా,గొప్ప తారతమ్యం లేదు. ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తెగువను ప్రేమ ఇస్తుంది.. ఇవన్నీ ఈ జంట కథకు సరిగ్గా సరిపోతుంది. వీరిద్దరిలో ఒకరు డ్యాన్సర్ కాగా, మరొకరు చిత్రకారుడు. అతనే డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ మహానందియా.. అతనితో తన చిత్ర వేయించుకోవడానికి వచ్చిన ఆమె షార్లెట్ వాన్ షెడ్విన్ వారిద్దరి ప్రేమ కథే ఇది. 

షార్లెట్ వాన్ షెడ్విన్ 1975లో ఢిల్లీలో భారతీయ కళాకారుడు పీకే మహానందియాను కలిశారు. షెడ్విన్ మహానందియా కళ గురించి విన్న తర్వాత స్వీడన్ నుండి భారత్ కు వచ్చారు. ఆమె తన పోర్ట్రెయిట్‌ను అతనితో వేయించుకోవాలనుకున్నారు. అప్పటికే డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ మహానందియా కళాకారుడిగా తనకంటూ ఒక పేరు సంపాదించడం ప్రారంభించాడు. అతను ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో పేద ఆర్ట్ విద్యార్థి.


అలా శ్రీ మహానందియా తన పోర్ట్రెయిట్‌ను తయారు చేస్తున్నప్పుడు వారిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. అతను ఆమె అందానికి ప్రేమలో పడితే.. ఆమె అతని సింప్లిసిటీకి ప్రేమలో పడింది. వాన్ షెడ్విన్ స్వీడన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పటికే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

బీబీసీకి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో, మహానందియా మాట్లాడుతూ, "ఆమె మా నాన్నను మొదటిసారి కలిసినప్పుడు చీర కట్టుకుంది. ఆమె ఎలా మేనేజ్ చేసిందో నాకు ఇంకా తెలియదు. మా నాన్న, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో, మేము గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాం" ఆమె బయలుదేరే టైం దగ్గర పడింది. ఆమె మధ్యలో వదిలేసినతన చదువును పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే తాను వెళ్లాలని భర్తను అక్కడికి రావాలని కోరింది. స్వీడిష్ టెక్స్‌టైల్ పట్టణం బోరాస్‌లోని తన ఇంటికి వస్తానని అతనితో ప్రమాణం చేయించుకుంది. 

ఆ తరువాత ఇద్దరు ఉత్తరాల ద్వారా టచ్ లో ఉన్నారు. ఆమె వెళ్లిన ఒక సంవత్సరం తర్వాత, అతను వాన్ షెడ్విన్‌ను కలవాలనుకున్నాడు. అయితే, అతని దగ్గర విమాన టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి తన వద్ద డబ్బు లేదు. దీంతో తనకున్నదంతా అమ్మేసి సైకిల్ కొన్నాడు. తరువాత ఆ సైకిల్ మీద ఆమెను చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. నాలుగు నెలల వ్యవధిలో, అతను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీలను దాటాడు. అతని సైకిల్ దారిలో చాలాసార్లు పాడయ్యేది. అతను రోజుల తరబడి ఆహారం లేకుండా కూడా వెళ్ళవలసి వచ్చింది. కానీ ఏదీ అతని సంకల్పాన్ని అడ్డుకోలేదు. 

అతను జనవరి 22, 1977న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 70 కి.మీ. సైకిల్ ప్రయాణం చేసేవాడు. "ఈ సమయంలో నా కళ నన్ను రక్షించింది. మార్గమధ్యలో నేను వ్యక్తుల చిత్రాలను తయారు చేసిచ్చేవాడిని.. దానికి వారు కొంత డబ్బు ఇచ్చేవారు. మరికొందరు నాకు ఆహారం, ఆశ్రయం ఇచ్చారు" అని అతను చెప్పాడు.

అలా అతను మే 28న ఇస్తాంబుల్,  వియన్నా మీదుగా యూరప్ చేరుకున్నాడు. ఆపై రైలులో గోథెన్‌బర్గ్‌కు ప్రయాణించాడు. అక్కడ తన భార్యను కలుసుకున్నాడు. వీరిద్దరూ అధికారికంగా స్వీడన్‌లో పెళ్లి చేసుకున్నారు.

"యూరోపియన్ సంస్కృతి గురించి నాకు ఏమీ తెలియదు. అది నాకు కొత్తది, కానీ ఆమె నాకు ప్రతీ విషయంలోనూ మద్దతు ఇచ్చింది. ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నేను 1975లో ఉన్నట్లే ఇప్పటికీ ఆమెతో ప్రేమలో ఉన్నాను" అని చెప్పాడు. ఈ జంట ఇప్పుడు వారి ఇద్దరు పిల్లలతో స్వీడన్‌లో నివసిస్తున్నారు. అతను కళాకారుడిగా పని చేస్తూనే ఉన్నాడు.

Latest Videos

click me!