తెలంగాణలో మార్చి 22, 23 రెండ్రోజులు సెలవేనా?
కొత్త సంవత్సరం ఆరంభంనుండి విద్యాసంస్థలకు సెలవులే సెలవులు వస్తున్నాయి. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి 1న ప్రారంభమైన సెలవులు సంక్రాంతి, శివరాత్రి, హోలి అంటూ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో సెలవు ఈ జాబితాలో చేరిపోయింది... ఇది ఆదివారంతో కలిసిరావడంతో వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోంది.
ప్రస్తుతం రంజాన్ నెల కొనసాగుతోంది... ముస్లింలు ఈ నెలంతా ఉపవాస దీక్షలు చేపడతారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ముస్లింలకు పలు ఐచ్చిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మార్చి 21న అంటే ఇవాళ హజ్రత్ అలీ షహదత్ ని పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. ఈ సంవత్సరం ఆరంభంలో ప్రభుత్వం విడుదలచేసిన హాలిడేస్ లిస్ట్ లో మార్చి 21న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది.
అయితే రంజాన్ మాసంలో 21వ రోజున హజ్రత్ అలీ షహదత్ ఉంటుంది. మార్చి 2 న రంజాన్ నెల ప్రారంభమైంది కాబట్టి మార్చి 22న హజ్రత్ అలీ షహదత్ వస్తుంది. కాబట్టి మార్చి 21 ఐచ్చిక సెలవును మార్చి 22కు మార్చింది. మార్చి 23న ఆదివారం సాధారణ సెలవు... ఇలా ఈ వారం వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోంది.
అయితే ఇది కేవలం ఆప్షనల్ హాలిడేనే కాబట్టి రేపు(శనివారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉండదు... కేవలం మైనారిటీ స్కూళ్లు, కాలేజీలకే సెలవు ఉంటుంది. అలాగే ముస్లిం ఉద్యోగులు కూడా ఈరోజు సెలవు తీసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ లోని పాతబస్తీతో పాటు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సెలవు ఉండనుంది.