Miss World Krystyna
Miss World 2025: మరికొద్దిరోజుల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అందాలు రెట్టింపు కానున్నాయి. ఈ చారిత్రాత్మక నగరానికి ప్రపంచ సుందరులు క్యూ కట్టనున్నారు... వీరి అందాలతో నగరం కొత్త అందాలను సంతరించుకోనుంది. అందమైన ముద్దగుమ్మలు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడనున్నారు. ఇలా మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.
మిస్ వరల్డ్ 2025 పోటీలను ఈసారి హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ అందాల పోటీలు మే 7 నుండి మే 31 వరకు జరగనున్నాయి. అంటే దాదాపు నెలరోజుల పాటు ప్రపంచంలోని అందమైన అమ్మాయిలంతా హైదరాబాద్ లో సందడి చేయనున్నారు. అయితే ఈసారి ఎవరు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంటారో చూడాలి.
ప్రపంచ సుందరిని ఎంపికచేసే పోటీలు జరుగుతుండటంతో అందరిచూపు హైదరాబాద్ పై వుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ అతిథులకు ఎలాంటి అసౌర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈ మిస్ వరల్డ్ 2025 పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రి ఏర్పాట్లగురించి మాట్లాడారు.
Miss World Krystyna
యాదగిరిగుట్టలో ప్రపంచ సుందరి సందడి :
మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ లో జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలంగాణకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆమె ప్రముఖ దేవాలయం యాదగిరిగుట్టను సందర్శించారు. అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టులో యాదగిరిగుట్టకు వచ్చిన ఆమె లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు.
యాదాద్రి ఆలయానికి చేరుకున్న క్రిస్టినాను కలెక్టర్ హనుమంతరావు, దేవాలయ ఈవో భాస్కరరావు స్వాగతం పలికారు... ఆలయ మర్యాదలతో కొండపైకి తీసుకెళ్లారు. అక్కడ ఆలయ సిబ్బంది దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించారు... గర్భగుడిలోని స్వయంభు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం క్రిస్టినాకు తీర్థప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలను అందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట విశిష్టతను ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు క్రిస్టినా. ఎక్కడ ఆలయ సాంప్రదాయాలకు భంగం కలిగించకుండా నడుచుకున్నారు. అందాల క్రిస్టినాను ఇలా అచ్చతెలుగు చీరకట్టులో చూసిన భక్తులు కళ్లు తిప్పుకోలేకపోయారు.