తెలుగు vs తమిళ్ : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్, చంద్రబాబు, పవన్, జగన్ మద్దతు ఎవరికి?

Published : Aug 19, 2025, 09:14 PM IST

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి తెలుగు వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని ఏ రాజకీయ పార్టీ ఎవరికి మద్దతిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వర్సెస్ తమిళ్

Vice President Election : భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి అధికార ఎన్డిఏ, ప్రతిపక్ష ఇండి కూటమి పోటీ పడుతున్నాయి… బిజెపి సీపి రాధాకృష్ణన్ ను, కాంగ్రెస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఇద్దరూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే.. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు కాగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు. కాబట్టి ఇద్దరిలో ఎవరు గెలిచినా ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాది వ్యక్తికి దక్కడం ఖాయమయ్యింది.

అయితే ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ప్రకటించిన తర్వాత పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు పోటీ ఎన్డిఏ vs ఇండి కూటమి నుండి తమిళ్ vs తెలుగుగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని అన్నిపార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఎవరికి మద్దతిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

DID YOU KNOW ?
తెలుగు ఉపరాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతిగా తెలుగు రాష్ట్రాల నుండి వెంకయ్య నాయుడు ఒక్కరే వ్యవహించారు. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి వ్యవహరించారు.
26
తెలంగాణలో ఏపార్టీ మద్దతు ఎవరికి..

కాంగ్రెస్ పార్టీ :

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తారు. ఇండి కూటమిలో కాంగ్రెస్ కీలకపార్టీ... అంతేకాదు ఈ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ వ్యక్తి. అదిష్టానం నిర్ణయానుసారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డికే ఓటేయడం ఖాయం.

తెలంగాణ బిజెపి :

తెలంగాణ బిజెపి ఎంపీలు ఎన్డిఏ అభ్యర్థి సీపి రాధాకృష్ణన్ కు మద్దతివ్వనున్నారు. ఇండి కూటమి తెలంగాణ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించినా అదిష్టానం నిర్ణయానికే బిజెపి ఎంపీలు కట్టుబడి ఉంటారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కోరినప్పటికీ జస్టిన్ సుదర్శన్ రెడ్డికి బిజెపి ఎంపీల మద్దతు ఉండకపోవచ్చు.

36
బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది?

భారత రాష్ట్ర సమితి పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ పార్టీ కాంగ్రెస్ ను బద్ద శత్రువుగా చూస్తోంది... కాబట్టి ఇప్పటికయితే బిఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ కాంగ్రెస్ అదిష్టానం ఉపరాష్ట్రపతి బరిలో నిలిపిన తెలంగాణ వ్యక్తికి మద్దతు ఇవ్వాలని కోరితే బిఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇదిలావుంటే ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ బిజెపికి దగ్గర అవుతోందనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ నాయకులయితే బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కేసీఆర్ కూతురు కవిత కూడా బిజెపి, బిఆర్ఎస్ దగ్గరవుతున్నాయని అంటున్నారు. ఇదే నిజమైతే బిఆర్ఎస్ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతుగా నిలుస్తుంది.

ప్రస్తుతానికి ఎన్డిఏ, ఇండి కూటమి రెండిటికి దూరంగా ఉంటోంది బిఆర్ఎస్. ఇలాగే ఉండాలని భావిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంబిస్తుంది... ఏ పార్టీకి మద్దతివ్వకుండా బిఆర్ఎస్ ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉండవచ్చు. ఇలా బిఆర్ఎస్ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆపార్టీ ఏది ఎంచుకుంటుందో త్వరలోనే తేలనుంది.

46
ఎంఐఎం ఎటువైపు?

తెలంగాణకు చెందిన మరో పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (AIMIM) కాంగ్రెస్ కు మద్దతిస్తుంది. ఇప్పటికే ఈపార్టీ పలు సందర్భాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ వ్యక్తి బరిలో నిలిచారు... కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

56
ఆంధ్ర ప్రదేశ్ లో ఏపార్టీ మద్దతు ఎవరికి

తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి :

గత ఎన్నికల్లో బిజెపితో జతకట్టాయి తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేశాయి... అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం టిడిపి, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో, ఎన్డిఏ కూటమిలో కీలకంగా వ్యవరిస్తున్నాయి... అంటే ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎంపిక ఈ పార్టీల అంగీకారంతోనే జరిగివుంటుంది. కాబట్టి ఇండి కూటమి తెలుగు వ్యక్తిని బరిలో నిలిపినా కూటమి పార్టీలు మాత్రం ఎన్డిఏ అభ్యర్థికే మద్దతివ్వడం ఖాయం.

66
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ, రాజ్యసభలో ఎంపీల బలం ఉంది. అందుకే బిజెపి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు కోరింది... స్వయంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైసిపి అధినేత వైఎస్ జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వైసిపి ఎన్డిఏకు మద్దతిచ్చింది.. మరి ఈసారి కూడా అలాగే వ్యవహరించే అవకాశాలున్నాయి.

అయితే గతంలో పరిస్థితులు వేరు... ఇప్పటి పరిస్థితులు వేరు. రాష్ట్రంలో తమ రాజకీయ ప్రత్యర్థులైన టిడిపి, జనసేనతో బిజెపి జతకట్టింది... కాబట్టి గతంలో మాదిరిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏకు వైసిపి మద్దతుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్డిఏకు మద్దతు ఇవ్వకుంటే తటస్థంగా ఉండవచ్చు.. కానీ ఇండి కూటమికి మాత్రం వైసిపి మద్దతిచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ తెలుగు వ్యక్తికి అండగా ఉండాలనుకుంటే మాత్రం వైసిపి నిర్ణయం మారవచ్చు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసిపి ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories