అసలు ఏమిటీ ఫార్ములా ఈ కారు రేసు కథ... ఇందులో కేటీఆర్ పాత్రేమిటి?

First Published | Dec 20, 2024, 7:11 PM IST

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అరెస్ట్ తప్పేలా లేదు. ఈ క్రమంలో అసలు ఈ ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారమేమిటో చూద్దాం. 

Case filed against KTR

Case filed against KTR : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడిందని ... కల్వకుంట్ల  కుటుంబం వేలకోట్ల ప్రజాధనం దోచుకున్నారని అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తోంది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం వంటి అంశాలపై ఇప్పటికే విచారణ చేయిస్తోంది. తాజాగా ఫార్ములా ఈ- కార్ రేసింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. 

అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో భారీ అవినీతి జరిగిందనేది ప్రభుత్వ వాదన. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న రేవంత్ సర్కార్ ఏసిబి (అవినీతి నిరోధక విభాగం) ని రంగంలోకి దింపింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసిబికి లేఖ రాయడం... వెంటనే ఏసిబి స్పందించి మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదుచేయడం టకటకా జరిగిపోయాయి. ఆ వెంటనే కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించడం, ఈ కేసులో డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం ఆదేశించడం కూడా చకచకా జరిగిపోయాయి. 

ఈ పరిణామాలన్ని చూస్తుంటే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది... రేవంత్ సర్కార్ కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని చూస్తోందని. ఇదే సమయంలో కేటీఆర్ ఈ అరెస్ట్ నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడని కూడా అర్థమవుతోంది. అయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ అంటుంటే... లేదు లేదు అక్రమాలు జరిగాయని రేవంత్ ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో అసలు ఏమిటీ ఫార్ములా ఈ రేస్? ఎప్పుడు, ఎక్కడ, ఎవరు నిర్వహించారు? ఈ వ్యవహారం కేటీఆర్ మెడకు ఎలా చుట్టుకుంది? తదితర విషయాలు తెలుసుకుందాం. 
 

Formula E Car Race

ఫార్ములా ఈ కారు రేసు కథేంటి... 

తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. రాజధాని నగరం హైదరాబాద్ నడిబొడ్డున ఓవైపు హుస్సెన్ సాగర్, మరోవైపు కొత్త సచివాలయం మధ్య ఎన్టిఆర్ గార్డెన్ నుండి ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల మేర ఈ కారు రేస్ సాగింది. ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డును సంసిద్దం చేసారు. 

ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు చెందిన రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ ట్రాక్ పై దూసుకెళుతూ హైదరబాదీలను అలరించాయి. ఈ రేసు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది... ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలతో ఎన్టిఆర్ మార్గ్ ను రెండుమూడు రోజులు మూసివేసారు. అంతేకాదు ఈ కారు రేసును చూసేందుకు వచ్చే సామాన్యులు, విఐపిల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. 

ఇక ఈ ఫార్ములా ఈ కార్ల రేసింగ్ టికెట్లను బుక్ మై షో ద్వారా అమ్మారు. సామాన్య ప్రజలు టికెట్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఇలా హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ కారు రేసును నిర్వహించింది కేసీఆర్ సర్కార్. ఈ రేసుకు అనుమతి నుండి ఏర్పాట్ల వరకు అంతా తానయి చూసుకున్నారు ఆనాటి పురపాలక, ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్. 


Formula E Car Race

మరి ఫార్ములా ఈ కారు రేసులో జరిగిన అవినీతి ఏమిటి? 

ఫార్ములా ఈ రేసు నిర్వహణ వరకు అంతా బాగానే వుంది. కానీ ఆ తర్వాతే భారీ అవినీతి జరిగిందనేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. 2023 ఆరంభంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్ కావడంతో 2024 లో కూడా దీన్ని నిర్వహించేందుకు గత ప్రభుత్వం సిద్దమయ్యింది... అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. 

ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని అంటోంది. అంతేకాదు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బిఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది. ప్రాథమిక విచారణ అనంతరం ఇటీవలే గవర్నర్ అనుమతి తీసుకుని మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. 

2024 లో మరోసారి ఫార్ములా ఈ రేసు నిర్వహించేందుకు ముందస్తుగా ఇచ్చిన రూ.55 కోట్లపై ఏసిబి విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని... ఇందులో కేటీఆర్ కీలక పాత్ర పోషించాడని ఏసిబి అనుమానిస్తోంది. దీంతో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి ని ఏ3 గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(A), 13(2) తో పాటు ఐపిసి 409,120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. 

KTR

కేటీఆర్ ఏమంటున్నారు? 

ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలు, నమోదుచేసిన కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా అవినీతి జరగలేదని...  హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతూ అబివృద్దికి దోహదపడుతుందనే ఈ అంతర్జాతీయ స్థాయి రేసును నిర్వహించినట్లు తెలిపారు. నగర ప్రగతికి అవసరం అనుకుంటే ప్రభుత్వ అనుమతి లేకపోయినా  హెచ్ఎండిఏ నిధులు ఖర్చు చేయవచ్చని...ఇది కార్పోరేషన్ చట్టంలోనే వుందన్నారు కేటీఆర్ వివరించారు. 

ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి జరిగిందని ఏదయినా ఆధారాలుంటే బైటపెట్టాలని... లేదంటే అసెంబ్లీలో దీనిపై చర్చించాలని  కేటీఆర్ అధికార పక్షాన్ని కోరారు. ఎలాంటి చర్చకైనా తాను సిద్దమేనని కేటీఆర్ స్పష్టం చేసారు. ఫార్ములా ఈ కారు రేసు ఒప్పందంలో ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేసారని...దీనిపై న్యాయపరంగానే పోరాడతానని కేటీఆర్ చెబుతున్నారు.
 

Latest Videos

click me!