కృష్ణా జలాల్లో ఏ రాష్ట్రం వాటా ఎంత? :
దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో గోదావరి, కృష్ణా చాలా ముఖ్యమైనవి. ఈ రెండు నదులు కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ప్రవహిస్తాయి. ఈ నదీజలాలను రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు 1969 లో కేంద్ర ప్రభుత్వం బచావత్ కమిటీని ఏర్పాటుచేసింది.
ఈ కమిటీ ఏ రాష్ట్రం ఎంత నదీజలాలను వాడుకోవాలో నిర్ణయించింది. మహారాష్ట్ర 560 టిఎంసి, కర్ణాటక 700 టిఎంసి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 800 టిఎంసి నీటిని కేటాయించారు. అయితే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ మధ్య కృష్ణా నదీజలాల విషయంలో ఓ ఒప్పందానికి వచ్చాయి. 512 టీఎంసిలు ఏపీ, 299 టిఎంసిలు తెలంగాణ వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆ తర్వాత ఈ కృష్ణా నదీజలాల పంపకంలో తమకు అన్యాయం జరిగిందని... తమకు అధిక నీటివాటా రావాలని తెలంగాణ అంటోంది. కృష్ణా నది తెలంగాణలోనే ఎక్కువగా ప్రవహిస్తుంది... పరివాహక ప్రాంతం ఇక్కడే ఎక్కువ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ కంటే తమకే ఎక్కువ నీళ్లు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన 800 టిఎంసిల్లో 70 శాతం అంటే 558 టిఎంసిలు తమకే దక్కాలనేది తెలంగాణ వాదన.
తెలంగాణ వాదనను ఆంధ్ర ప్రదేశ్ వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల్లో తమకే అధికవాటా కావాలంటోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి నీటిని వాడుకుంటోంది. దీంతో తెలంగాణ, ఏపీల మధ్య నీటికోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ నదిపై నిర్మించే ప్రాజెక్టులపైనా ఇరు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసుకుంటున్నాయి... తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ... ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమంగా నిర్మిస్తున్నారని తెలంగాణ అంటోంది. ఇలా కృష్ణా నదీజలాల వివాదం కొలిక్కి రావడంలేదు.