తెలంగాణలో శివాజీ జయంతికి సెలవు ఉంటుందా?
తెలంగాణలో శివాజీ జయంతికి పూర్తిస్థాయిలో సెలవు ఇవ్వకపోవచ్చు... కానీ ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే హిందుత్వ విద్యాసంస్థలకు సెలవు ఉండవచ్చు. లేదంటే సేవాలాల్ జయంతి మాదిరిగానే ప్రత్యేక సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే బిజెపి నాయకులతో పాటు హిందుత్వ యువజన సంఘాలు శివాజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. హైదరాబాద్ తో పాటు అన్ని పట్టణాల్లోనూ ఇప్పటికే బైక్ ర్యాలీలు, అన్నదానాలు, రక్తదానాలు వంటి కార్యక్రమాలకు సిద్దమయ్యారు. గ్రామాల్లో కూడా శివాజీ జయంతి ఉత్సవాల కోసం యువత సిద్దమవుతున్నారు.
కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా శివాజీ జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. అలాగే హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శివాజీ జయంతి రోజున పండగ వాతావరణం ఉండనుంది. ఇక గోషామహల్ లో బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.