కలెక్టర్లకు రేవంత్ వార్నింగ్ అందులో భాగమేనా?
'నాయకులు వస్తుంటారు..పోతుంటారు.. కానీ ఐఏఎస్, ఐపిఎస్ లు మాత్రం ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉండాలి. ప్రజా ప్రయోజనాల కోసమే ఆలోచించాలి'... ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు సివిల్ సర్వెంట్స్ కు చురకలు అంటించినట్లే ఉన్నా అంతరార్థం మాత్రం వేరేలా వున్నట్లు అనిపిస్తోంది.
కొందరు ఉన్నతాధికారులు తన మాట వినకుండా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని సీఎం రేవంత్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్ లు తమ పదోన్నతుల కోసమో ఇంకా వేరే ఏదయినా ఆశించో కొందరు నాయకులు ఎలా చేబితే అలా చేస్తుంటారు. ఇలా అధికారులను చేతిలో పెట్టుకుని తనపై పైచేయి సాధించాలని అనుకుంటున్న తన సహచర నాయకులకు చెక్ పెట్టేందుకు రేవంత్ ఐఏఎస్, ఐపిఎస్ లపై గరం అయ్యారనే ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా రేవంత్ వరుస డిల్లీ పర్యటనలు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మార్పు, ఇప్పుడు ఐఎఎస్, ఐపిఎస్ లకు వార్నింగ్...ఇవన్నీ చూస్తుంటే రేవంత్ కు పదవీగండం ఉందన్న ప్రతిపక్షాల అనుమానాలకు బలం చేకూరుతోంది. మరి నిజంగానే తెలంగాణ సీఎంను మార్చేందుకు తెరవెనక ఏవయినా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందుకోసమే కాంగ్రెస్ నాయకులు బిసి నినాదం ఎత్తుకున్నారా? అన్నది భవిష్యత్ రాజకీయాలే తేలుస్తాయి.