Published : Jul 15, 2025, 11:08 AM ISTUpdated : Jul 15, 2025, 12:09 PM IST
మార్కెట్ వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యవసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రానున్న వారాల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమవ్వాల్సిన జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కూరగాయల సాగు ప్రభావితమైంది. ముఖ్యంగా టమాటా, బెండకాయ, కాకర, గోరుచిక్కుడు, దోసకాయ వంటి వాటి పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్‌లో 6 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, వాస్తవంగా కేవలం 4.2 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
25
దిగుబడి తగ్గడంతోనే
పంటలు తక్కువ రావడంతో మార్కెట్లలో సరఫరా కొరత ఏర్పడింది. ఫలితంగా డిమాండ్‌కి తగ్గ ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు లభించక, ధరలు భారీగా పెరిగాయి. జూన్ నెలలోనే ఈ ప్రభావం మొదలైపోయింది. తాజాగా జూలైలో ధరలు మరింత ఎగబాకుతున్నాయి.
35
నెల రోజుల్లోనే 60% దాకా ధరల పెరుగుదల
రైతు బజార్లలో కొన్ని ముఖ్యమైన కూరగాయల ధరలు గత నెలతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. రూ. 55 ఉన్న కిలో బీన్స్ ధర ప్రస్తుతం ఏకంగా రూ. 90 దాటేసి సెంచరీ దిశగా దూసుకెళ్తోంది. ఇక రూ. 55గా ఉన్న కిలో క్యాప్సికం ధర రూ. 80కి చేరింది. కిలో చిక్కుడు ధర రూ. 75, పచ్చి మిర్చి ధర రూ. 60, బజ్జీమిర్చి ధర రూ. 55, బెండకాయ ధర రూ. 45కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే ధరలో భారీగా పెరుగుదల కనిపించింది.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 30 శాతం వరకు కూరగాయల సాగు తగ్గిపోయింది. ఇవి ప్రధానంగా పండించే ప్రాంతాలు కావడంతో మొత్తం రాష్ట్ర స్థాయిలో సరఫరా తక్కువగా ఉంది. దీంతో పరిస్థితిని సమతుల్యం చేయడానికి ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ కారణంగానే ధరలు పెరిగినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
55
ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతున్న తెలంగాణ
స్థానికంగా పంటలు తక్కువగా రావడంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతులు చేసుకుంటున్నారు. ఈ దిగుమతుల కారణంగా మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. కాగా రానున్న శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కూరగాయ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.