Urea Shortage : తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరత ... టాప్ 7 కారణాలివే?

Published : Sep 16, 2025, 11:49 AM ISTUpdated : Sep 16, 2025, 12:05 PM IST

Urea Shortage : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం యూరియా కొరత కొనసాగుతోంది… ఇది చివరకు రైతులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగే స్థాయికి చేరింది. మరి ఈ ఎరువుల కొరతకు కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
16
తెలంగాణ, ఏపీలో యూరియా కొరత

Urea Shortage : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతుల ఆందోళనలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి లేదు... చిన్నచిన్న సమస్యలున్నా ఆందోళనలు, ధర్నాలు చేసే స్థాయివి కావు. కానీ ఇప్పుడు అన్నదాతల ఆందోళనలు కనిపిస్తున్నాయి... ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెద్దపెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి... గతంలో మాదిరిగా చెప్పులు, పట్టా పాస్ బుక్కుల క్యూలైన్లు కనిపిస్తున్నాయి... చంటిపిల్లలతో వచ్చే మహిళా రైతులు, వయసు మీదపడ్డ రైతులు వ్యవసాయ పనులు వదులుకునిమరీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. చివరకు కొందరు రైతులు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇదంతా ఎందుకో తెలుసా... కేవలం యూరియా కోసం.

వర్షాకాలంలో దేశవ్యాప్తంగా పంటల సాగు అధికంగా ఉంటుంది... అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రైతులు ఖరీఫ్ పంటలు సాగుచేస్తున్నారు. అయితే ఈ పంటల సాగుకు వర్షం ఎంత ముఖ్యమో ఎరువులు కూడా అంతే ముఖ్యం. గతంలో సహజసిద్దంగా రైతులే పశువ్యర్థాలతో ఎరువులు తయారుచేసుకునేవారు... కానీ ఇప్పుడు రసాయన ఎరువులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కానీ ఒక్కోసారి డిమాండ్ కు సరిపడా ఎరువులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోవడంతో రైతులు ఇబ్బంది పడాల్సివస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఇలాగే మారింది... తమ పంటలను కాపాడుకునేందుకు ఎరువుల కోసం రైతులు చిన్న యుద్దమే చేయాల్సివస్తోంది.

26
తెలంగాణలో 'యూరియా' పాలిటిక్స్

తెలంగాణలో యూరియా కొరత ఎక్కువగా ఉంది. రైతులు వానలో తడుస్తూనే క్యూలైన్లలో నిలబడినా, రోజంతా పడిగాపులు కాసినా ఒకటిరెండు బస్తాలకంటే ఎక్కువ దొరకడం లేదు. చివరకు పరిస్థితి ఎలా తయారయ్యిందంటే రైతులను వ్యవసాయ అధికారులు కంట్రోల్ చేయలేక పోలీస్ స్టేసన్లలో యూరియా బస్తాల పంపిణీ చేపట్టడం... యూరియా లోడ్ తో వెళుతున్న లారీలను రైతులు అడ్డుకోవడం వంటి ఘటనలు చూస్తున్నాం. దీంతో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ కూడా యూరియా చుట్టే సాగుతున్నాయి.

ఈ యూరియా కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి... రాష్ట్రానకి సరిపడా యూరియాను సరఫరా చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది... లేదులేదు సరఫరా తగ్గించడంవల్లే కొరత ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎరువుల కొరతకు అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ రెండూ కారణమేనని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇలా మూడు పార్టీల మధ్య యూరియా వ్యవహారంపైనే మాటలయుద్దం సాగుతోంది. మరోవైపు రైతులు కూడా అధికార కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... పాలకుల వైఫల్యం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వాపోతున్నారు.

36
ఆంధ్ర ప్రదేశ్ లో యూరియా కొరత

మొత్తంగా యూరియా కొరత తెలంగాణలో హీట్ పెంచింది. రైతులు ఆందోళనలు, రాజకీయా నాయకుల మాటలయుద్దం కొనసాగుతున్నాయి. ఇలా కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ ను కూడా యూరియా కొరత వెంటాడుతోంది... కానీ అక్కడ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఘటనలు కనిపించడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు యూరియా కొరత ఉందని చెబుతుంటే టిడిపి నాయకులు అలాంటిదేమీ లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా తెలంగాణ స్థాయిలో ఆందోళనకర పరిస్థితులు కనిపించడంలేదు. అక్కడక్కడా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వెలుగులోకి వస్తున్నాయి.

అయితే రసాయన ఎరువులు వినియోగాన్ని తగ్గించేందుకు రైతులను చైతన్యపర్చే చర్యలు తీసుకోవాలని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కేంద్రం అందించే సబ్సడీలను నేరుగా రైతులకు అందేలా చూడాలని... ముఖ్యంగా యూరియా వినియోగాన్ని తగ్గించి సహజసిద్దమైన పద్దతుల్లో పంటలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. ఇలా చేస్తే బస్తాకు రూ.800 వరకు రైతులకు లాభం చేకూర్చవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలా యూరియా వినియోగాన్ని తగ్గిస్తే ఆటోమెటిగ్గా కొరత అనేదే ఉండదని... ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

46
తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతకు కారణాలివే

1. సాగుభూమి పెరగడం :

తెలుగు రాష్ట్రాలు రైతు భరోసా, అన్నధాత సుఖీభవ వంటి రైతు సంక్షేమ పథకాలను చేపడుతున్నాయి. అలాగే గత పదేళ్లలో అనేక సాగునీటి ప్రాజెక్టులను చేపట్టాయి. దీంతో గతంలో వ్యవసాయయోగ్యంగా లేనిభూమి కూడా సాగుభూమిగా మారింది. ఇలా ప్రతిఏటా సాగుభూమి పెరగడంలో ఎరువుల వినియోగం కూడా పెరిగింది. కానీ దేశంలో ఎరువులు ఉత్పత్తి, దిగుబడి ఆ స్థాయిలో పెరగలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల కొరతకు సాగుభూమి పెరగడం కూడా ఓ కారణంగా వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.

2. వరి, పత్తి పంటల సాగు పెరగడం :

సాధారణంగా ఇతర పంటలతో పోలిస్తే వరి, పత్తి పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటలే ఎక్కువగా రైతులు వేస్తున్నారు.. కాబట్టి ఎరువుల వినియోగం ఎక్కువయ్యింది. అందువల్లే ఈ స్థాయిలో ఎరువుల కొరత ఏర్పడిందనేది మరికొందరు వ్యవసాయ నిపుణుల వాదన.

56
యూరియా కొరతకు అంతర్జాతీయ కారణాలు

3. రైతుల అవగాహనలోపం :

రైతులకు ఏ పంటకు ఎంత ఎరువు వాడాలి? అనే అవగాహన ఉండటంలేదు... అందుకే ఎంత ఎక్కువ ఎరువులు వాడితే అంత ఎక్కువ పంట దిగుబడి వస్తుందని భావించేవారే ఎక్కువగా ఉంటున్నారు. తద్వారా అవసరం లేకున్నా ఎరువులు కొనుగోలు చేసి ఇష్టం వచ్చినట్లు పంటపొలాల్లో చల్లుతున్నారు... అలాగే భవిష్యత్ అవసరాల కోసమని ఇంట్లో దాచుకునేవారు ఉన్నారు. దీనివల్ల కూడా ఎరువుల కొరత ఏర్పడుతోంది. కాబట్టి ప్రభుత్వాలు ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి.

4. అంతర్జాతీయ పరిస్థితులు :

అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు కూడా యూరియా కొరతకు కారణమయ్యాయి. యూరియా ఉత్పత్తికి ఉపయోగించే సహజ వాయువుల ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడటం కూడా భారత్ లో యూరియా కొరతకు కారణమయ్యాయి.

5. చైనా నుండి తగ్గిన దిగుబడి, దేశంలో తగ్గిన ఉత్పత్తి ;

భారతదేశం ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే రసాయన ఎరువులను దేశీయంగా తయారుచేసుకోవడంతో పాటు పొరుగుదేశం చైనా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈసారి చైనా ఎరువుల ఎగుమతిని తగ్గించింది. ఇదే సమయంలో తెలంగాణలో రామగుండం ఫెర్టిలైజర్స్ ఆండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL), ఒడిషాలోని తాల్చేర్ ఫెర్టిలైజర్ ప్లాంట్ లో ఎరువుల ఉత్పత్తి కూడా తగ్గింది. దీంతో ఈసారి ఎరువుల కొరత ఎక్కువగా ఉంది.

66
కృత్రిమ ఎరువుల కొరత ఉందా?

6. వ్యవసాయేతర కార్యకలాపాలకు యూరియా వాడకం :

గతంలో కేవలం వ్యవసాయం కోసమే యూరియా వంటి రసాయన ఎరువులను వాడేవారు. కానీ ఇప్పుడు వ్యవసాయేతర పనులకు అంటే కల్తీ పాలు, కల్తీ బీర్ల తయారీ వంటివాటికి కూడా యూరియాను ఉపయోగిస్తున్నారు. ఇలా వ్యవసాయం కోసం సబ్సిడీపై అందించే యూరియా పక్కదారి పట్టడం కూడా కొరతకు కారణం అయ్యింది.

7. కృత్రిమ ఎరువుల కొరత :

భారతదేశంలో ఫెర్టిలైజర్స్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే మరో వాదన ఉంది. ఇలా కొరత సృష్టించి అధిక ధరలకు వాటిని అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా రైతులకు సబ్సిడీపై అందించాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలించడంకూడా ప్రస్తుతం యూరియా కొరతకు ఓ కారణంగా తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories