Published : Aug 13, 2025, 07:39 AM ISTUpdated : Aug 13, 2025, 07:45 AM IST
School Holidays: భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పాఠశాలలకు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతుండటం, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కుండపోత వర్షాలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వానలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ అత్యవసర చర్యలు తీసుకుంది. ఆగస్టు 13, 14 తేదీల్లో GHMC పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు హాఫ్ డే సెలవులు ప్రకటించింది. అలాగే, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పాఠశాలలకు పూర్తి రోజు సెలవులు ఇచ్చారు.
25
5 రోజుల వరుస సెలవులు
తాజగా ప్రకటించిన రెండు రోజుల వర్షాల సెలవులకు తోడు, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం ఉండటంతో విద్యార్థులకు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం హాఫ్ డే మాత్రమే అమల్లో ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
35
వాతావరణ శాఖ హెచ్చరికలు
వాతావరణ శాఖ ప్రకారం.. వచ్చే 72 గంటలపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఇప్పటికే జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రభుత్వం అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు.
భారీ వర్షాల కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ప్రభుత్వం ఐటి కంపెనీలకు సూచించింది. ఇరిగేషన్ శాఖ అధికారుల సెలవులు రద్దు చేసి, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
విపత్తు నివారణ నిధులను వినియోగించుకోవాలనీ. నిధులకు కొరత లేదని ప్రభుత్వం అధికారులకు సూచించింది. గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూంకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
55
హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ నగరానికి రెండు రోజులపాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకారం.. నగరంలో 269 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించారు. జలమండలి, ట్రాఫిక్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచించారు.