
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నుండి బీఆర్ఎస్ కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆహ్వానాలు అందాయి. అయితే కాంగ్రెస్ వైపు తుమ్మల నాగేశ్వరరావు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం చేసుకుంటున్నారు. గత నాలుగైదు రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల నుండి అనుచరులు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వస్తున్నారు. ఆయనతో సమావేశమౌతున్నారు. ప్రజా క్షేత్రంలో ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులకు సూచిస్తున్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావుతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు సమావేశమయ్యారు. ఇవాళ నాలుగు మండలాలకు చెందిన నేతలు తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్టు ఇవ్వని బీఆర్ఎస్ నాయకత్వానికి తుమ్మల నాగేశ్వరరావు చెక్ పెట్టే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్ లో తుమ్మల నాగేశ్వరరావు చేరిన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ క్యాడర్ లో మెజారిటీ తుమ్మల నాగేశ్వరరావు వెంట నడిచింది. తుమ్మల నాగేశ్వరరావు వెంటే ఆయన అనుచరులు నడిచే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలపై తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టుంది. పలు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తుమ్మల నాగేశ్వరరావు ప్రభావితం చేసే అవకాశం ఉంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు రూపంలో బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. తుమ్మల నాగేశ్వరరావుతో జరుగుతున్న సమావేశాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడ హాజరౌతున్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావుతో జరిగిన నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు కూడ పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జిల్లాలో చెక్ పెట్టే దిశగా తుమ్మల నాగేశ్వరరావు వ్యూహరచన ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసిన వారికి చెక్ పెట్టేందుకు తుమ్మల నాగేశ్వరరావు కూడ అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రానున్న రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రకటిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మూడు రోజుల క్రితం ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు.