కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఈటల ఎఫెక్ట్... టీఆర్ఎస్ అలర్ట్, క్యాంప్ రాజకీయాలు షురూ

First Published Nov 24, 2021, 8:03 AM IST

కరీంనగర్ స్థానికసంస్థల కోటా ఎన్నికలపై హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్ పడినట్లుంది. దీంతో ముందుజాగ్రత్తగా టీఆర్ఎస్ క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టింది. 

కరీంనగర్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలపై హుజురాబాద్ ఉపఎన్నిక ఎఫెక్ట్ పడినట్లుంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికవగా స్థానికసంస్థల కోటాలో కూడా ఆ పార్టీ అభ్యర్ధుల గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులే అత్యధికంగా వున్నారు. ఇలా స్ఫష్టమైన ఆధిక్యం వుంది కాబట్టి గెలుపు తమదేనని ధీమాతో వున్న అధికార పార్టీకి ప్రజాప్రతినిధులు సరికొత్త తలనొప్పిని తెచ్చి పెట్టారు. పార్టీకి వ్యతిరేకంగా కొందరు తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ రాజకీయాలను ప్రారంభించింది.
 

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో టిడిపిని వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎల్. రమణను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో చివరివరకు ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన కరీంనగర్ నేతల అసంతృప్తితో వున్నారు. ఇందులో ఒకరయిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ రెబెల్ గా ఇప్పటికే నామినేషన్ వేసారు. తాజా పరిణామాలతో టీఆర్ఎస్ అప్రమత్తమయ్యింది. 

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన దాదాపు 850మంది ప్రజాప్రతినిధులు మంగళవారం క్యాంప్ కు తరలారు. మిగిలిన మరో 146మందిని కూడా ఇవాళ(బుధవారం) క్యాంప్ కు తరలించే ఏర్పాటు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని వివిధ రిసార్టుల్లో ప్రజాప్రతినిధులకు క్యాంప్ ఏర్పాటు చేసారు. 
 

ఇప్పటికే నామినేషన్ల గడువు ముగియగా విత్ డ్రాకు రెండు రోజుల సమయం వుంది. అప్పటివరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్ విత్ డ్రా చేయించే ప్రయత్నాలను టీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారు.  నామినేషన్లన్ని విత్ డ్రా అయితే రెండు రోజుల్లో క్యాంప్ ముగియనుంది. లేదంటే క్యాంప్ రాజకీయాలు కొనసాగే అవకాశాలున్నాయి.
 

ఇక ప్రస్తుతం క్యాంప్ లో వున్న స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు ఫోన్ వినియోగించడానికి కూడా అనుమతి లేదు. ఫోన్ ద్వారా కూడా వారిని ఎవరూ సంప్రదించే అవకాశం లేదు. ఇక మహిళా ప్రజాప్రతినిధులు తమ భర్తలను కూడా క్యాంప్ కు తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పించారు. భార్యాభర్తలిద్దరు క్యాంప్ కొనసాగే రిసార్ట్ లో వుండేందుకు టీఆర్ఎస్ అధిష్టానం అనుమతిచ్చింది.  
 

కరీంనగర్ లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ఎదిరించి ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో ధైర్యం  చేసిన కొందరు నాయకులు పార్టీ టికెట్ దక్కకున్నా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసారు. దీంతో ఒక్క కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికే పదులసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ తప్ప మిగతా రాజకీయ పార్టీలేవీ పోటీలో లేకున్న భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో అధికార పార్టీలో గుబులు మొదలయ్యింది. 

తమకు సరైన నిధులు, ప్రాతినిధ్యం, ప్రాధాన్య లభించడం లేదంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

click me!