గల్లీ నుండి డిల్లీకి... ప్రజా ఆశీర్వాదంతోనే టీఆర్ఎస్ ప్రభంజనం: ఎమ్మెల్యే రవిశంకర్

First Published Sep 2, 2021, 11:32 AM IST

కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పండగ ఘనంగా జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్నారు. 

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా జెండా పండగ కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యాక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ... గల్లీ నుండి డిల్లీ దాకా గులాబీ జెండా ఎగురుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఎదుగుతోందని... దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు.

''ఆసరా పెన్షన్లు  ,రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, సాగు నీరు, తాగునీరు, కళ్యాణలక్ష్మీ లేదా షాదీ ముభారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు సహాయం, దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గొల్లకురుమలకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు ఇలా దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అందజేయడం జరుగుతుంది'' అని రవిశంకర్ పేర్కొన్నారు.

''ఉద్యమ రథసారథిగా కేసీఆర్ సారథ్యంలో ఉప్పెనలా మొదలైన టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు డిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరింది. ఇది మనందరికీ గర్వకారణం. గులాబీ జెండా పట్టాలంటే భయపడిన రోజుల నుండి గులాబీ జెండా ఎత్తడం గర్వకారణమనే స్థాయికి పార్టీని కేసీఆర్ ముందుకు నడిపించారు. దక్షిణాది పార్టీలలో డిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్. అందుకు ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుంది'' అని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. 

మానకొండూర్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా ఆనందోత్సాలతో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. 
 

click me!