హైదరాబాద్: ఇప్పటికే నిత్యావసర వస్తువల ధరలు పెంపుతోనే సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్రం గ్యాంగ్ బాంబ్ పేల్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో మళ్లీ గ్యాస్ తో పాటు పెట్రోల్, డిజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరవడం ప్రారంభించింది. ఇలా ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపడాన్ని నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ(గురువారం) ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. రోడ్డు మీదే కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ వంటావార్పు కార్యాక్రమంలో ఎమ్మెల్సీ కవిత స్వయంగా గరిట తిప్పారు.