బీహార్ నుంచి సికింద్రాబాద్.. 34 మంది మైనర్ల అక్రమ రవాణా.. నలుగురు దళారుల అరెస్ట్...

First Published | Apr 20, 2023, 11:58 AM IST

బీహార్ టు సికింద్రాబాద్ వయా కాజీపేట.. మీదుగా అక్రమంగా తరలిస్తున్న 34 మంది మైనర్లను పోలీసులు రక్షించారు. వీరిని తరలిస్తున్న నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. 

వరంగల్ : బీహార్ నుంచి సికింద్రాబాద్ కు మైనర్ బాలలను తరలిస్తున్న దళారులను కాజీపేట రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 34 మంది మైనర్ బాలలను రక్షించారు.  చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, కాజీపేట రైల్వే స్టేషన్ ఆర్పిఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో బీహార్ నుంచి సికింద్రాబాద్ కు మొత్తం 34 మంది బాలలను తరలిస్తున్నారు.  

వీరిని పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఈ మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానికంగా ఉన్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరిని తరలిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరిని బాల కార్మికులుగా వివిధ పరిశ్రమల్లో పని చేయించడానికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరందరిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చెందారావు తెలిపారు. 

Latest Videos


కాజీపేట మీద నుంచి హైదరాబాద్,  న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో బాలలను అక్రమంగా తరలిస్తున్నారని.. వారిని గుర్తించి రక్షించాలని.. ఇటీవల ఒక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా అనిల్ చెందారావు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఇటీవల.. వివిధ శాఖల స్వచ్ఛంద సంస్థలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామని.. అందులో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇది జరిగిందని తెలిపారు.

ఈ నిర్ణయాల ప్రకారమే బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న రైలులో తనిఖీలు చేపట్టగా 34 మంది బాల కార్మికులను గుర్తించామని తెలిపారు. పిల్లలతో మాట్లాడి మిగతా వివరాలు కనుక్కున్న తర్వాత వారి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించి.. వారిని పిలిపించి పిల్లలను అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు ఈ 34 మంది పిల్లలకు తాత్కాలిక వసతి నిమిత్తం పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. 

click me!