Telangana Weather : హైదరాబాద్ లో మారిన సీన్ ... ఇక శివరాత్రి వరకు ఇంతే

First Published | Dec 26, 2024, 4:01 PM IST

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్ గా మారింది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇలాగే ఎప్పటివరకు వుండనుందో తెలుసా? 

Hyderabad Weather

Telangana Weather : తెలంగాణలో నిన్నటి(బుధవారం) నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చూద్దామన్నా సూర్యుడు కనిపించడంలేదు... ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి పగలే చీకట్లు కమ్ముకుంటున్నాయి. దీనికి తోడు చిరుజల్లులు కురుస్తున్నాయి...దీంతో చలితీవ్రత బాగా పెరిగింది. రాజధాని హైదరాబాద్ లోనే ఇట్లోంచి బయటకు రావడానికి భయపడేంత చలి వుంది... మరి పల్లెటూళ్లలో పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే తెలంగాణలో ఈ పరిస్థితి కారణం. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా తెలంగాణలో చిరుజల్లులు కురుస్తూ చలి తీవ్రతను పెంచాయి. ఇన్నిరోజులు వాతావరణం మామూలుగానే వుండి ఇప్పుడు ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు కంగారుపడిపోతున్నారు. వాతావరణ మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుండటమే ఈ ఆందోళనకు కారణం. 

అయితే డిసెంబర్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగానే చలి ఎక్కువగా వుంటుంది. కానీ తెలంగాణలో గత నెల నవంబర్ లోనే చలి మొదలయ్యింది... కాబట్టి ఈ నెలలో చలితీవ్రత మరింత పెరగాల్సింది. కానీ డిసెంబర్ లో ఇప్పటివరకు చలి ఎక్కువగా లేదు...ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో అసలు చలే లేదని చెప్పాలి. కానీ అల్పపీడన ప్రభావంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 
 

Hyderabad Weather

తెలంగాణను వణికిస్తున్న చలి : 

తెలంగాణలో డిసెంబర్ లో చలి ఎక్కువగానే వుంటుంది... కానీ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇది మరింత పెరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగైదు రోజులనుండి అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. కానీ తెలంగాణలో ఎలాంటి వాతావరణ మార్పులు జరగలేవు. కానీ గత మంగళవారం నుండి ఇక్కడ కూడా పరిస్థితి మారింది. 

అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా పడింది...దీంతో నిన్న(బుధవారం) మొత్తం ఆకాశం మేఘాలతో కప్పేసి వుంది... హైదరాబాద్ తో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో చలితీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. బుధవారం రాత్రి ఉష్ణోగ్రత బాగా పడిపోయింది... చలితీవ్రత ఎక్కువగా వుండే ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో పరిస్థితి మరింత ఘోరంగా మారింది. చలి తీవ్రత బాగా పెరగడంతో ప్రజలు ఉదయం,సాయంత్రం ఇళ్లలోంచి బయటకు వచ్చేందకు జంకుతున్నారు. 

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. కానీ దీని ప్రభావం ఈ నెల 28 వరకు అంటే మరో రెండుమూడు రోజులు వుంటుందని హెచ్చరిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు మరికొన్నిరోజులు ఈ చలికి వణకాల్సిందే అన్నమాట. 

ఈ అల్పపీడనం ప్రభావం ముగిసినా తెలంగాణలో చలిగాలులు కొనసాగుతాయి. ఎందుకంటే సాధారణంగా శీతాకాలంలో అత్యధిక చలి వుండేది జనవరిలోనే...మరీముఖ్యంగా ఈ నెల మధ్యలో వచ్చే సంక్రాంతి పండగపూట చలి పీక్స్ లో వుంటుంది. ఫిబ్రవరిలో ఈ చలి తీవ్రత తగ్గుతుంది. శివరాత్రికి చలి శివ శివా అంటూ వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ఫిబ్రవరి ముగిసేవరకు ఈ చలిగాలులు భరించాల్సిందే. 
 


Hyderabad Weather

చలికలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునే హెల్త్ టిప్స్ :  

చలి తీవ్రత పెరిగింది కాబట్టి ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చలి నుండి రక్షణ కోసం ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగా రూం హీటర్లు, ఇతర ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాదిన ఎక్కడా వుండదు. కేవలం చలికాలం నాలుగునెలలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది... ఆరోగ్యంగా వుండవచ్చు.

1. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా వుంచుకునేందుకు సాధారణంగా అందరూ ఉపయోగించేవి స్వెటర్లు, మంకీ క్యాప్స్, శాలువాలు. ప్రస్తుతం చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లేటపుడు వీటిని ధరించడం మరిచిపోవద్దు. 

2. ఉదయం, సాయంత్రం పూట చలి ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఆ సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లకపోవడమే మంచింది. బయట ఏదయినా పని వుంటే తెల్లవారుజామున, అర్ధరాత్రులు చేసుకోవడం కంటే మద్యాహ్నం సమయంలో పూర్తిచేసుకోవాలి. బైక్ పై ప్రయాణం అంత మంచింది కాదు... మరీముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కురుస్తుంది కాబట్టి ఆ సమయంలో బైక్ పై అస్సలు బయటకు వెళ్లకండి. చలితో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. 

3. ఈ  చలికాలంలో ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకుని తినడమే మంచింది. చల్లటి పదార్థాలను తినకుండా వుండాలి. పిల్లలకు కూడా ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటివాటికి దూరంగా వుంచాలి.  

4. తెల్లవారుజామున వాకింగ్,జాగింగ్ కు వెళ్లేవారు, వ్యాయామాలు చేసేవారు జాగ్రత్తగా వుండాలి. కుదిరితే సూర్యుడు ఉదయించాక వాతావరణం కొంత వేడిగా మారుతుంది...అప్పుడు బయటకు వస్తే మంచింది. ఈ సూర్యరశ్మి వల్ల డి విటమిన్ కూడా లభిస్తుంది. 

5. శీతాకాలంలో శరీరం పొడిబారుతుంది... కొందరికి శరీరం పగిలి రక్తం వస్తుంటుంది. కాబట్టి శరీరాన్ని తేమగా వుంచుకునేందుకు మాయిశ్చరైజర్లు వాడాలి. శ్వాస, చర్మ సంబంధిత సమస్యలు వున్నవారు మరింత జాగ్రత్తగా వుండాలి. అలాగే చిన్నపిల్లలు,వృద్దులు కూడా చలికాలంలో మరింత జాగ్రత్తగా వుండాలి. 

ఇలా చలికాలంలో పాటించాల్సినవి అనేక హెల్త్ టిప్స్ వుంటాయి. వాటిని ఫాలో అవుతూ ఈ చలిగాలులు నుండి రక్షణ పొందండి.లేదంటే జలుబు,దగ్గు వంటి చిన్నచిన్న సమస్యలే కాదు ఇతర ఆనారోగ్య సమస్యలు రావచ్చు. 

Latest Videos

click me!