రాబోయే 4 రోజులు జాగ్రత్త ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Published : Oct 20, 2025, 09:29 PM IST

Telangana Weather Alert: రాబోయే నాలుగు రోజులపాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. హైదరాబాద్ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

PREV
15
తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు

తెలంగాణలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరోసారి ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న 4 రోజుల్లో ఈ వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

25
బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అది పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతూ 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ పరిణామాలు తెలంగాణ వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

35
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో సోమవారం రాత్రి నుంచి బుధవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. గురువారం, శుక్రవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని టీజీడీపీఎస్ తెలిపింది.

45
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్

హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని, రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అవసరం లేని సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలనీ, ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుత్ స్తంభాల నుండి దూరంగా ఉండాలని సూచించింది.

55
వర్షాలతో రైతుల్లో ఆందోళన

మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు కోసి ఆరబోస్తున్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిందని, రైతులు నష్టపోతున్నారని సమాచారం. వర్షాల తీవ్రత పెరిగితే మరిన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు కోసిన పంటలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలనీ, తాత్కాలిక కవర్లు ఏర్పాటు చేసుకోవాలనీ సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories