నిజామాబాద్: పోలీసు కాల్పుల్లో కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడు రియాజ్ మృతి.. ఏం జరిగింది?

Published : Oct 20, 2025, 08:21 PM IST

Nizamabad: నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు రియాజ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటన పై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం

నిజామాబాద్ నగరాన్ని మాత్రమే కాదు తెలంగాణ మొత్తాన్ని కుదిపేసిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. అక్టోబర్ 17న సీసీఎస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్, వాహన దొంగతనం కేసులో షేక్ రియాజ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, బైక్‌పై వెనుక కూర్చున్న రియాజ్ మధ్యలో కత్తితో ప్రమోద్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ప్రమోద్ మరణించగా, రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణ పోలీస్ విభాగాన్ని కుదిపేసింది.

25
ఎవరీ షేక్ రియాజ్? 40కి పైగా కేసులు

షేక్ రియాజ్ వయస్సు 24 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, అతని నేర చరిత్ర చాలనే ఉంది. వాహన దొంగతనాలు, చైన్ స్నాచింగ్, దాడులు వంటి నేరాలకు సంబంధించి 40కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నాలుగు సార్లు జైలుకు వెళ్లిన ఈ నిందితుడు, తరచుగా పోలీసులకు తలనొప్పిగా మారాడు. ఈసారి కానిస్టేబుల్‌ హత్య  కేసులో నిందితుడిగా ఉండటంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

35
సారంగపూర్‌లో పోలీసులకు చిక్కిన షేక్ రియాజ్

ఒక పోలీసు కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడిగా పరారీలో ఉన్న రియాజ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ల సహాయంతో గాలింపు చేపట్టారు. రెండు రోజుల తర్వాత, అక్టోబర్ 19న సారంగపూర్ అటవీ ప్రాంతంలోని పాడుబడ్డ లారీ క్యాబిన్‌లో రియాజ్ దాక్కున్నాడని సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు రియాజ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్‌పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. అక్కడే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

45
ఆసుపత్రిలో ఉద్రిక్తత.. పోలీసులపై మళ్లీ దాడికి యత్నించిన రియాజ్

నిజామాబాద్ జీజీహెచ్‌లో రియాజ్ చికిత్స పొందుతున్న సమయంలో, అతడికి కాపలా కాస్తున్న కానిస్టేబుల్ చేతిలో గన్ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. మరోసారి దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెంటనే ప్రతిస్పందించారు. ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

55
రియాజ్ కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి ఏమన్నారంటే?

రియాజ్ పై కాల్పులు జరిగిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. “రియాజ్ తప్పించుకోవడానికి ప్రయత్నించే సమయంలో పోలీసులపై దాడి చేశాడు. వెపన్ లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో జరిగిన ఈ సంఘటనలో రియాజ్ మరణించాడు” అని డీజీపీ తెలిపారు.

అంతకుముందు డీజీపీ నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పై స్పందించారు. “కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ ఇస్తాం” అని తెలిపారు. అలాగే, తెలంగాణలో శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో కాపాడేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిబద్దతతో ఉందన్నారు. ఎంతటి తీవ్ర నేరస్తులను అయినా అత్యంత కఠినంగా అణచివేస్తామని చెప్పారు. కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పలు హింసాత్మక ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories