Published : Aug 06, 2026, 12:12 PM ISTUpdated : Aug 06, 2026, 12:21 PM IST
ఏటిఎం, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల మాదిరిగానే స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. నాణ్యత, భద్రతతో కూడిన ఈ రేషన్ కార్డులను సిద్దం చేసిన తెలంగాణ సర్కార్ పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. ఎప్పట్నుంచి పంపిణీ చేపట్టనున్నారో తెలుసా?
Smart Ration Cards : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్ట్ 15న అంటే ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజును రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల రేషన్ కార్డు పొందినవారితో పాటు గతంలో కార్డు ఉన్నవారికి కూడా భద్రతా ఫీచర్లు కలిగిన స్మార్ట్ కార్డును అందించనున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు... అదేరోజు 119 నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది.
24
కోటి రేషన్ కార్డుల పంపిణీ...
అర్హులైన ప్రతి ఒక్కరికీ అహార భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం.. ఇందుకోసం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఉచితంగా బియ్యం అందిస్తోంది. అయితే ప్రభుత్వం నుండి బియ్యం పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డును పొందే అవకాశం కల్పించింది. ఇలా లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు పొందాయి… అయితే వీరికి ఇప్పటివరకు ఫిజికల్ కార్డు మాత్రం అందలేదు.
కొత్తగా అర్హత పొందినవారికే కాదు అందరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ఆగస్టు 15 నుండి పంపిణీ చేసేందుకు సిద్దమయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో కూడా జారీ చేశారు.
సంగారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు... ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
34
కలెక్టర్లకు కీలక బాధ్యతలు..
కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్ల వరకు ఆయా జిల్లా కలెక్టర్లు బాధ్యత వహించాలని... అధికారులను సమన్వయం చేసుకుంటూ అంతా సజావుగా సాగేలా చూడాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని... వీలైనంత తొందరగా కార్డులను లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించింది. స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం చేసుకుంటూ పౌరసరఫరా శాఖ అధికారులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మరింతమంది పేదలకు చేరువ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పటివరకు కాగితపు రేషన్ కార్డులే ఉన్నాయి... వీటిని కొందరు లామినేషన్ చేయించుకుని భద్రపర్చుకునేవారు. అయితే కొందరు అలాగే కాగితపు రేషన్ కార్డు వాడటంవల్ల పాడయిపోయేవి… దీంతో మరో కార్డు తీసుకోవాలంటే డబ్బులు ఖర్చయ్యేవి. అంతేకాదు ఈ రేషన్ కార్డులో భద్రతా ఫీచర్లు ఏవీ లేవు. అందుకే పాత కార్డుల స్థానంలో నాణ్యమైన పివిసి స్మార్ట్ కార్డులను సిద్దం చేసింది ప్రభుత్వం. ఇవి ఏటిఎం కార్డుల మాదిరిగా ఉంటాయి... వీటితో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా పీచర్లు ఉంటాయి.
ఈ పివిసి స్మార్ట్ రేషన్ కార్డులో ముందుభాగంలో యజమాని ఫోటోతో పాటు కార్డు వివరాలు ఉంటాయి. వెనక భాగంగా క్యూఆర్ కోడ్ తో పాటు కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఈ రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు లభిస్తాయి. ఈ కార్డును ఉపయోగించిన కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా ఈజీగా రేషన్ పొందవచ్చు.