KCR
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి గజ్వేల్ లో ఓడిపోతారనే కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా కేసీఆర్ ను ఓడిస్తామని పౌల్ట్రీ రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో పౌల్ట్రి రైతుల ప్రకటన రాజకీయ అలజడి రేపుతోంది. కామారెడ్డిలో కేసీఆర్ పై 100 మంది పౌల్ట్రి రైతులు నామినేషన్ వేయనున్నట్లు తెలంగాణ పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది.
poultry
నిన్న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగుతున్న కామారెడ్డిలోనే తెలంగాణ పౌల్ట్రి రైతుల అసోసియేషన్ సమావేశమయ్యింది. రాష్ట్రంలో పౌల్ట్రీ రైతుల సమస్యల గురించి, ఈ రంగానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాలను చర్చించారు. ఈ క్రమంలో పౌల్ట్రి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు...కాబట్టి ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే 100 మంది పౌల్ట్రీ రైతులను బరిలోకి దింపడానికి సిద్దమయ్యారు.
kamareddy
ఇదిలావుంటే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోతున్న రైతులు కూడా ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ రద్దుకోసం పోరాటం చేస్తున్న ఐక్య కార్యాచరణ కమిటీ ఇప్పటికే 100 మంది బాధిత రైతులు కేసీఆర్ పై పోటీకి నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు. తమ భూములను మాస్టర్ ప్లాన్ పేరిట ప్రభుత్వం అన్యాయంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. తమ భూములు కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళతామని కామారెడ్డి రైతులు హెచ్చరించారు.
kcr
ఇప్పటికైనా ప్రభుత్వం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో వెనక్కి తగ్గాలని... లేదంటే సీఎం కేసీఆర్ ను ఓడిస్తామని రైతులు హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ భూములు కోల్పోతున్న ప్రతి గ్రామంలో 15 మంది చొప్పున మొత్తం 100 మంది సీఎం కేసీఆర్ పై పోటీకి దిగుతారని ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించిది.
kcr
ఇక ఇప్పటికే కాయితీ లంబాడీలు కూడా కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి సిద్దమయ్యారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 1,016 మంది లంబాడీలు త్వరలోనే నామినేషన్లు వేస్తారని ప్రకటించారు. ఇలా కేసీఆర్ పై రైతులు, వివిధ వర్గాల ప్రజలు పోటీ చేస్తామంటూ ప్రకటించడం రాజకీయ కలకలం రేపుతోంది.
KCR
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాగే పసుపు రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో దిగారు. దీంతో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమిపాలై బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించాడు. ఇలాగే ఈసారి కేసీఆర్ ను ఓడిస్తామంటూ హెచ్చరికల నేపథ్యంలో బిఆర్ఎస్ అప్రమత్తమైంది. ఇప్పటికే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. మిగతావారికి కూడా సముదాయించే పనిలో బిఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగారు.