Telangana: పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వివాదం అనంతరం మళ్లీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలకు దారి తీసింది. మరి ఆ మంత్రులు ఎవరు.? ఆ అంశం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపోయి అంతర్గత తగాదాలకు తెరలేపారు. వరంగల్ జిల్లాలో తమ ఆధిపత్యం చూపించేందుకు అటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబం, ఇటు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తహతహలాడుతూనే ఉన్నారు. వారు కాకుండా ఇప్పుడు కొత్తగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరావు మధ్య యుద్ధం మొదలైంది.
25
కొండా సురేఖ వెర్సస్ పొంగులేటి
శనివారం మంత్రి కొండా సురేఖ.. తోటి కేబినేట్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరావుపై రాష్ట్ర హైకమాండ్‌ను ఫిర్యాదు చేశారు. తమ ఎండోమెంట్స్ శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని.. రూ. 71 కోట్ల టెండర్ ప్రక్రియను తమ తరపువాళ్లకు వచ్చేలా చేశారని ఆరోపించారు మంత్రి సురేఖ. ఈ అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించడమే కాదు.. ఆపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు వివరణాత్మక లేఖను పంపించారు మంత్రి సురేఖ.
35
టెండర్ల లొల్లి
ఎండోమెంట్స్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న సురేఖ.. తనకు తెలియకుండానే పొంగులేటి శ్రీనివాసరావు టెండర్లను ఖరారు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు నేరుగా తెలియజేయడానికి ఆమె ఢిల్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య గతంలో తలెత్తిన వివాదం పార్టీ జోక్యం ద్వారా సద్దుమణిగిన కొన్ని వారాల తర్వాత మళ్లీ కొత్తగా ఈ వివాదం తలెత్తిన విషయం విదితమే.
తాజా ఎపిసోడ్ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సమన్వయ లోపాన్ని మరోసారి బయటపెట్టిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ఆయన దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏం చేయనున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
55
ఎవరి వెర్షన్ వారిది..
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా తన అధికార పరిధిలోనే మంత్రి వ్యవహరించారని పొంగులేటి శిబిరం చెబుతోంది. అటు సురేఖ మద్దతుదారులు ఆమెకు సీనియారిటీ ఉన్నప్పటికీ ఆమెను పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ సమస్య ఇప్పుడు జాతీయ నాయకత్వానికి చేరుకుంది. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.