దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై విచారణను శనివారానికి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకొంది. మృతదేహాల అప్పగింతపై సుప్రీంకోర్టు తమను నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు తేల్చి చెప్పింది.
ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి సమీపంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మృతి చెందారు.
అదే రోజున నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు జరపాలని భావించారు. కానీ, ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో మృతదేహాలను భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో నిందితుల మృతదేహాలు భద్రపర్చారు.
ఈ విషయమై పలు పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉందేమోననే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది.
అయితే హైకోర్టు నిర్ణయంతో అడ్వకేట్ జనరల్ ఏకీభవించలేదు. ఎన్‌కౌంటర్ జరిగిన రోజునే నిందితుల మృతదేహాలకు నిపుణులైన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించినట్టుగా ఆయన కోర్టుకు తెలిపారు.
మృతదేహాల అప్పగింతపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తమకే వదిలేసినట్టుగా తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయమై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.
గత నెల 27వ తేదీన శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి సర్వీస్ రోడ్డులో డాక్టర్ దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్ కు పాల్పడి హత్య చేశారు. ఈ నిందితులను 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నిందితులు దిశతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కూడ మరికొన్ని హత్యలకు కూడ పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కేసుల డిఎన్ఏ రిపోర్టులతో నిందితుల డిఎన్ఏ రిపోర్టులను సరిపోల్చేందుకు పోలీసు బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.