హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చిన సాయిచంద్ అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే చికిత్స కోసం నాగర్ కర్నూల్ గాయత్రి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గుండెపోటుతో గాయత్రి ఆస్పత్రిలోనే మృతి చెందారు. అయితే, సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు సాయిచంద్ మృతిని నిర్ధారించారు.ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సాయిచంద్ ఆకస్మిక మృతిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కళాకారులు,ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాయిచంద్ మరణ వార్త నమ్మలేకపోతున్నానన్నారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నా అన్నారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, ఉద్యమ కారుడు సాయిచంద్ గారి మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ్ముడు సాయిచంద్ అకాల మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
సాయిచంద్ గారు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే, గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి చేరుకుని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి హరీశ్ రావు..
jagadish reddy
సాయిచంద్ అకాల మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమంలో ,తెలంగాణా పునర్ నిర్మాణంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.
సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణవార్త తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. సాయిచంద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తన పాట మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పదునెక్కించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు మిత్రుడు సాయి చంద్ కు నివాళి అని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి భగవంతున్ని ప్రార్థించారు.
సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సంతాపం తెలిపారు. తమ్ముడు సాయి చంద్ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.